డిపాజిట్ల తర్వాత.. రూ.2000 నోట్లను.!

నవతెలంగాణ – హైదరాబాద్
రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ… వీటిని మార్చుకోవడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ వద్ద రూ.2000 నోట్లు అధికంగా ఉన్న వారు బ్యాంకులో డిపాజిట్ చేయడంతో పాటు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, జ్యువెల్లరీ, ఇంటి సరుకులు కొనుగోలు చేయడం తదితర వాటికి ఎక్కువగా రూ.2000 నోట్లను వినియోగిస్తున్నారు. ఈ నోట్లు కలిగిన వారు వీటిని ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి పబ్లిక్ యాప్ అనే సంస్థ దేశవ్యాప్తంగా ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో అత్యధికంగా 55 శాతం మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్, జ్యువెల్లరీ, గ్రాసరీ కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. టాప్ 3లో ఇవే ఉన్నాయి. రూ.2000 నోట్ల మార్పిడి సమయంలో తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని 61 శాతం మంది చెప్పారు. కేరళలో 75 శాతం, ఏపీలో 53 శాతం, తమిళనాడులో 50 శాతం మంది ఈ ప్రక్రియ సులువుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నోట్లను అంగీకరించడం లేదని 42 శాతం మంది తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును పెంచాలని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. రూ.2 వేల నోట్ల మార్పిడికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.20 వేల పరిమితిని పెంచాలని 44 శాతం మంది కోరారు.

Spread the love