జవాన్ల శవాలపై 2019 ఎన్నికలు

– జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ మాలిక్‌
– అదానీ సంపద అంతా ప్రజలదే
– ప్రభుత్వాన్ని మార్చాల్సిందే..
జైపూర్‌ : కేంద్ర ప్రభుత్వంపై జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మరోసారి నిప్పులు చెరిగారు. 2019 లోక్‌సభ ఎన్నికలు సైనికుల మృతదేహాల పైనే జరిగాయని విమర్శిం చారు. పుల్వామా ఘటనపై విచారణ జరిగి ఉంటే అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజీనామా చేయాల్సి వచ్చేదని, అనేక మంది అధికారులు జైలుకు వెళ్లే వారని, పెద్ద వివాదమే చెలరేగేదని ఆయన అన్నారు. పుల్వామా దాడి జరిగిన వెంటనే ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశానని, అయితే ఆయన మౌనంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారని చెప్పారు. రాజస్థాన్‌లోని ఆల్వాల్‌ జిల్లా బన్సూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుల్వామా ఉగ్ర దాడి జరిగిన సమయంలో ప్రధాని మోడీ జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో షూటింగ్‌లో ఉన్నారని మాలిక్‌ చెప్పారు. ఆయన అక్కడ నుండి బయటికి వచ్చి తనకు ఫోన్‌ చేస్తే సైనికులు చనిపోయిన విషయం చెప్పానని, తప్పు జరిగిందని అన్నానని, అయితే నోరు విప్పవద్దని ఆయన ఆదేశించారని వివరించారు. అదానీ వ్యవహారంపై కూడా మాలిక్‌ స్పందించారు. కేవలం మూడేండ్ల కాలంలోనే ఆయన చాలా సంపద పోగేసుకున్నారని తెలిపారు. అదానీ రూ. 20 వేల కోట్లు ఆర్జించారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంటులో చెప్పారని, ఆ డబ్బు ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కోరారని, అయితే ఆ వైపు నుంచి జవాబు రాలేదని అన్నారు. రాహుల్‌ రెండు రోజులు మాట్లాడినా ఎవరూ బదులివ్వలేదని, ఎందుకంటే మోడీ వద్ద జవాబు లేదని చెప్పారు. అదంతా మన సొమ్మేనని తాను చెబుతున్నానని అన్నారు. ‘వాళ్లు వారి ముఖ్యమంత్రుల నుండి దోచుకొని అదానీకి ఇచ్చారు. ఆయన దానితో వ్యాపారం చేశాడు. ఆ డబ్బంతా మనదేనని అంటున్నా’ అని మాలిక్‌ చెప్పారు. తాను గోవాలో ఉన్నప్పుడు అక్కడి ముఖ్యమంత్రి అవినీతిపై మోడీకి ఫిర్యాదు చేశానని, ఫలితంగా తనను గవర్నర్‌ పదవి నుంచి తొలగించారని, సీఎం మాత్రం పదవిలో కొనసాగారని వివరించారు. ప్రధాని పర్యవేక్షణలోనే అవినీతి జరిగిందని, అందులో ఆయనకూ వాటా ఉందని, మొత్తం డబ్బంతా అదానీకి పోతుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిందిగా మాలిక్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు మళ్లీ వారికే ఓటేస్తే ఆ తర్వాత మీకు మరోసారి ఓటేసే అవకాశమే ఉండదు. ఆయన మిమ్మల్ని ఓటు వేయనీయడు. ప్రతిసారీ నేనే గెలుస్తాను. అనవసరంగా ఎన్నికలపై దండగ ఖర్చు ఎందుకని అంటాడు’ అని ఎద్దేవా చేశారు.

Spread the love