– మైండ్‌స్పేస్ జంక్షన్ దాటడం పెద్ద సవాలే
– ఈ జంక్షన్ కింద అండర్‌పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లైఓవర్
– మూడు అడ్డంకులను దాటేందుకు ప్లాన్ చేస్తున్నాం :హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-2 మెట్రో నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మైండ్‌స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31కిలోమీటర్ల మేర మెట్రో లైన్ సొంత నిధులతో చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన కూడా చేయించారు. హెచ్‌ఏఎంఎల్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను వేగిరం చేశారు. ఇందులో భాగంగా హెచ్‌ఏఎంఎల్ సివిల్ ఇంజినీరింగ్ అడ్వైజర్, రైల్వే బోర్డు మాజీ సభ్యులు ఇంజినీరింగ్ సుభోద్ జైన్‌తోపాటు సంబంధిత సీనియర్ ఇంజినీర్లతో కలిసి హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ప్రత్యక్షంగా రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ మార్గం తనిఖీల్లో కొన్ని సవాళ్లను గుర్తించారు. అందులో ప్రధానంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు మెట్రో నిర్మాణానికి అతిక్లిష్టమైన ప్రాంతంగా ఉంది. ఈ మార్గంలో మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద అండర్‌పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లైఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని గుర్తించారు. రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు మెట్రో నిర్మాణం చాలా క్లిష్టతరమైందని, 21 మీటర్ల ఎత్తులో మైండ్‌స్పేస్ జంక్షన్ దాటడం సవాలుతో కూడు కుందని హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అండర్‌పాస్, మధ్యలో రోటరీ, ఫ్లైఓవర్ ఉన్నాయని, ఈ మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్‌ను అక్కడికక్కడే నిర్మించే విధంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద 20మీటర్ల (66 అడుగులు) ఎత్తులో బహుళ స్థాయి ఫ్లైఓవర్‌ను దాటడం మరొక సవాలు. ఫ్లైఓవర్ పిల్లర్ల పునాదులపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడకుండా ఉండేందుకు ఎయిర్‌పోర్ట్ మెట్రో పిల్లర్లను ఫ్లైఓవర్ పిల్లర్లకు దూరంగా నిర్మించాల్సి ఉంది. ఫ్లైఓవర్ మీదుగా నిర్మించబడే స్పాన్ క్రాసింగ్‌ను ‘ఇన్ సిటు’ పద్ధతిలో ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ గర్డర్లతో ప్లాన్ చేయవచ్చు. అలాగే పొడిగించిన మెట్రో కారిడార్-3(బ్లూ లైన్), ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ కొత్త ఇంటిగ్రేటెడ్ రాయదుర్గం స్టేషన్‌కు సంబంధించిన విభిన్న నిర్మాణ ప్రక్రియలు ప్రధానంగా ప్రయాణీకుల సౌలభ్యం కోణంలో పరిశీలించనున్నారు. ఈ బహుళ స్థాయి ఇంటర్‌చేంజ్ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఎక్స్‌ట్రా హై వోల్టేజ్ 400 కేవీ భూగర్భ కేబుళ్లు మార్చకుండా ఉండేలా స్టేషన్ డిజైన్ చేయనున్నారు. అత్యుత్తమ ఇంజినీరింగ్ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక్కడి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొని పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ మార్గంలో తనిఖీలు చేశామని వివరించారు. ఈ తనిఖీలో హెచ్‌ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌ఈవై సాయపురెడ్డి, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జేఎన్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.