వర్షాకాల సమావేశాల్లో 21 బిల్లులు

– ఢిల్లీ ఆర్డినెన్స్‌పై వాడివేడి చర్చకు అవకాశం
– అదానీ గ్రూప్‌ అవకతవకలపై కూడా…
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 21 బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఈ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్ట్‌ 11వ తేదీ వరకూ కొనసాగుతాయి. లోక్‌సభలో ఇప్పటికే ప్రవేశపెట్టిన బిల్లుల పైన, వివిధ బిల్లులపై పార్లమెంటరీ కమిటీలు అందజేసిన నివేదికల పైన కూడా చర్చ జరుగుతుంది. జీవ వైవిధ్య సవరణ బిల్లు, జనవిశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు, వివిధ రాష్ట్రాల సహకార సొసైటీల (సవరణ) బిల్లు, అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు, మధ్యవర్తిత్వ బిల్లును వివిధ పార్లమెంటరీ కమిటీలు ఇప్పటికే పరిశీలించి నివేదికలు అందించాయి. ఇవి సభ ఆమోదం పొందాల్సి ఉంది. కాగా దేశ రాజధానిలో సేవలపై నియంత్రణ విషయంలో జారీ చేసిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతుంది. దీనిపై పార్లమెంటులో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్‌పై తక్షణమే మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పెత్తనం కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేకపోవడంతో పెద్దల సభలో దీనిని ఎలాగైనా అడ్డుకునేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ బిల్లుపై నిన్నటి వరకూ స్పష్టమైన వైఖరి ప్రకటించని కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఆదివారం నాడు ఢిల్లీ ఆర్డినెన్సుకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. రాజధానిలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సును సమర్ధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
డేటా ప్రొటెక్షన్‌ బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. హిండెన్‌బర్గ్‌ నివేదికలో అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై చర్చించాలని, ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఇందుకు మోడీ ప్రభుత్వం సుతరామూ ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపు వ్యవహారం మరోసారి పార్లమెంటును కుదిపేసే అవకాశం ఉంది. కాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత పార్లమెంట్‌ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి. అంతేకాక నూతన పార్లమెంట్‌ భవనంలో తొలిసారి సమావేశాలు జరుగుతున్నాయి. పాత భవనంలో సమావేశాలను ప్రారంభించి, ఆ తర్వాత నూతన భవనంలోకి మారుస్తారని తెలుస్తోంది.
ఆర్‌టీఐ చట్టం పరిధిని కుదిస్తుంది డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై ఎంపీలకు లేఖ
మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) బిల్లు సమాచార హక్కు చట్టం పరిధిని కుదిస్తుందని, కేంద్రానికి విశేష విచక్షణాధికారాలు కట్టబెడుతుందని నేషనల్‌ క్యాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సీపీఆర్‌ఐ) అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లును అడ్డుకోవాలంటూ పార్లమెంట్‌ సభ్యులకు లేఖలు రాసింది. ఈ బిల్లు ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కును కోల్పోతారని ఎన్‌సీపీఆర్‌ఐ ఆ లేఖలో తెలిపింది. ‘ఆర్‌టీఐ చట్టానికి ప్రతిపాదించిన సవరణల ప్రకారం ప్రజలు విధిగా తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టంలో ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. నూతన బిల్లులో వాటిని తొలగించారు. సున్నితమైన వ్యక్తిగత సమాచారం వెల్లడికే ఈ బిల్లు పరిమితం కావడం లేదు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆర్‌టీఐ చట్టాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఈ బిల్లును ప్రతిపాదించారు’ అని వివరించారు.

Spread the love