విద్యారంగానికి రూ.21,389 కోట్లు

విద్యారంగానికి రూ.21,389 కోట్లు– గతేడాది కంటే 1.19 శాతం పెరుగుదల
– 15 శాతం కేటాయిస్తామని కాంగ్రెస్‌ హామీ
– బడ్జెట్‌లో 7.75 శాతం నిధులు ప్రతిపాదన
– తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు
– విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులకు రూ.500 కోట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యారంగానికి స్వల్పంగా నిధులు పెరిగాయి. 2024-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో విద్యకు రూ.21,389 (7.75 శాతం) కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2023-24 బడ్జెట్‌లో విద్యకు రూ.190,51.25 (6.56 శాతం) కోట్లు కేటాయించింది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యకు 1.19 శాతం నిధులను అధికంగా కేటాయించడం గమనార్హం. విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులను కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ అందుకనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. ఇది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాబట్టి తక్కువ నిధులను కేటాయించినట్టుగా తెలుస్తున్నది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో 15 శాతం నిధులను విద్యకు కేటాయిస్తుందని అధికార వర్గాల నుంచి సమాచారం. కొఠారి కమిషన్‌ సిఫారసుల ప్రకారం విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలి. ఆ దిశగా ఏ ప్రభుత్వమూ కేటాయించకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు విద్యార్థుల స్కాలర్‌ష ిప్‌లను సకాలంలో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొంది. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద వాటికి ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించింది. కళాశాల స్థాయిలో ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకు రాగల సమర్థతను సమకూరుస్తామని వివరించింది. ఉన్నత విద్యామండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత విద్యలో ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలిపింది. రాష్ట్రంలో 65 ఐటీఐలను ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లో అధికారుల బృందంతో అధ్యయనం చేయించి అవసరమైన రీతిలో ఉత్తమమైన ప్రణాళిక తయారు చేస్తామని ప్రకటించింది. శిక్షణ పొందిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు పొందేలా ఆ ప్రణాళిక ఉంటుందని తెలిపింది. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకుని రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు ప్రతిపాదించింది.
విద్యారంగానికి ఏటా బడ్జెట్‌ కేటాయింపులు (కోట్లలో…) ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌ విద్యకు కేటాయింపు శాతం
2024-25 రూ.2,75,891 రూ.21,389 7.75
2023-24 రూ.2,90,296 రూ.19,051 6.56
2022-23 రూ.2,56,958 రూ.16,043 6.24
2021-22 రూ.2,30,825 రూ.13,564 5.88
2020-21 రూ.1,82,914 రూ.12,127 6.63
2019-20 రూ.1,46,492 రూ.9,899 6.76
2018-19 రూ.1,74,453 రూ.13,278 7.61
2017-18 రూ.1,49,646 రూ.12,705 8.49
2016-17 రూ.1,30,415 రూ.10,738 8.23
2015-16 రూ.1,15,689 రూ.11,216 9.69
2014-15 రూ.1,00,637 రూ.10,956 10.88
2023-24 బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు (రూ.కోట్లలో…) విభాగం మొత్తం
పాఠశాల విద్య రూ.17,931.42
ఉన్నత విద్య రూ.2,959.10
సాంకేతిక విద్య రూ.487.64
ఇతరములు రూ.11.00
మొత్తం రూ.21,389.16

Spread the love