– హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల భారీ ఆపరేషన్
– ఐదు రాష్ట్రాల్లో ఏడు టీంలతో గాలింపు
– దేశ వ్యాప్తంగా 359 కేసులతో సంబంధం
– నిందితుల్లో యూపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే
– ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ 10 మంది లాయర్ల బృందం కోర్టులో వాదనలు
– వివరాలు వెల్లడించిన సైబర్‌క్రైమ్ డీసీపీ కవిత
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన నేరాల్లో అధిక సంఖ్యలో సైబర్ నేరాలే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను కట్టడి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడినవారితోపాటు డిజిటల్ అరెస్టు, ఆన్‌లైన్ ట్రేడింగ్, ఉద్యోగాలిపిస్తానంటూ అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టారు. నిందితులు దేశవ్యాప్తంగా 255 మంది బాధితులను ముంచారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 359 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 25 సెల్‌ఫోన్లు, 45 సిమ్ కార్డులు, 28 చెక్‌బుక్‌లతోపాటు క్రెడిట్, డెబిట్ కార్డులను, ల్యాప్‌టాప్, క్యూఆర్ స్కానర్‌లతోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో నిందితులకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్స్ డీసీపీ ధార కవిత వెల్లడించారు. ఐదు ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ నిర్వహించి 23 మంది సైబర్ నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు. వీరు వివిధ నేరాల్లో మొత్తం రూ.5.29 కోట్లు కాజేశారన్నారు. అక్కడి పోలీసుల సాయంతో అధునాతన సాంకేతికతను ఉపయో గించి ముఠా సభ్యులను పట్టుకున్నట్టు చెప్పారు. ఈ ముఠాలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు.
ఎమ్మెల్యేగా పోటీ.. ఆర్థిక కష్టాల్లోకి..
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కమలేష్ కుమారి వ్యాపారం నిర్వహిస్తూ, స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తోంది. ఆమె అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఎన్నికలలో పెద్దఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడంతో ఆమె ఆర్థిక కష్టాల్లోకి వెళ్లింది. దాంతో అందులో నుంచి బయటపడేందుకు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపింది. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన వాళ్లు ఆమె ఎన్జీఓ బ్యాంకు ఖాతాను వారికి అప్పగించాలని కోరారు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాను సైబర్ నేరగాళ్లకు అప్పగించింది. ఆ ఎన్జీఓ ఖాతాలో బాధితులు డిపాజిట్ చేసే సొమ్ములో కమీషన్ ఆమెకు అందుతుంది. ఇలా హైదరాబాద్‌కు చెందిన 70 ఏండ్ల వృద్ధుడు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో రూ.34 లక్షలు పోగొట్టుకున్నాడు. డిజిటల్ అరెస్టు పేరుతో అతన్ని 8 రోజులు సైబర్ క్రైమ్ నేరగాళ్లు భయపెట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ సతీష్‌రెడ్డి బృందం బ్యాంకు ఖాతాలను ఆరా తీయడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి బాధితుడి సొమ్ము డిపాజిట్ అయిందని గుర్తించారు. ఇలా కమలేష్‌కుమారికి రూ.1.90 కోట్లు వచ్చాయి. ఈ మేరకు ప్రత్యేక బృందం యూపీకి వెళ్లి కమలేష్‌కుమారితో పాటు మరికొంత మందిని అరెస్టు చేసింది. ఆమెను అరెస్టు చేయొద్దంటూ యూపీలో 10 మంది లాయర్ల బృందం కోర్టులో వాదనలు వినిపించడం గమనార్హం. అయితే, పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాలోకి బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ము, అక్కడి నుంచి ఇతర ఖాతాలకు వెళ్లిన వైనాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కవిత కోరారు. గుర్తు తెలియని వారి మాటలకు బోల్తా పడొద్దని, వాట్సాప్ కాల్స్‌లో పోలీసుల డ్రెస్సు వేసుకుని విచారించినా, బెదిరించినా సైబర్ మోసమని గుర్తించాలన్నారు. ప్రజలు అనుమానిత కాల్స్, మెసేజ్‌లు వస్తే స్పందించకూడదని, వాటికి స్పందిస్తే ఖాతా నుంచి డబ్బులు పోయే ప్రమాదముందని తెలిపారు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.