ఉత్తరాఖండ్ : టమాటా ధరలు కొండెక్కాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. చికెన్ ధర కన్నా టమాటా ధర పెరిగిపోయింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఉత్తరాఖండ్‌లో టమాటా ధర విపరీతంగా పెరిగింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 250లు పలుకుతోంది. ఈ విషయంపై కూరగాయల విక్రయదారుడు రాకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తర కాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టమాటాను కొనడానికి కూడా ఇష్టపడడం లేదు. గంగోత్రి, యమునోత్రిలో కిలో టమాటా రూ. 200 నుంచి రూ. 250లు పలుకుతోంది’ అన్నారు. కాగా, చెన్నైలో టమాటా కిలో 100 నుంచి 130 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం రేషన్ షాపుల్లో టమాటా సిబ్సిడీ ధరతో కిలో రూ. 60లు చొప్పున వినియోగదారులకు అందజేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో రూ. 101-121 వరకు టమాటా ధర ఉంది. టమాటా పండించే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో టమాటా ధరలు సామాన్యులు కొనుక్కోలేని ధరకు ఎగబాకింది.