ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 2500 ఐటీ ఉద్యోగాలు

కంపెనీల ఏర్పాటుకు అంగీకారం
– వాషింగ్టన్‌ డీసీలో ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో2500 ఐటీ ఉద్యోగాలు రానున్నాయని, ఆ పట్టణాల్లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి సదరు ప్రతినిధులు అంగీకరించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఆవల అపార ఐటీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాషింగ్టన్‌ డీసీలో 30కిపైగా ఐటీ కంపెనీ యాజమాన్యాలతో శుక్రవారం సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీ కాంజెస్ట్‌, డీ కార్బోనైజ్‌, డీ సెంట్రలైజ్‌ అనే త్రీడీ మంత్రతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. హైదరాబాద్‌ నగరం ఆవల ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాష్ట్రంలో అనుకూలతలు, కల్పించిన మౌలిక వసతులపై గురించి చెప్పారు. ఇప్పటికే వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్‌, నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. అదిలాబాద్‌లోనూ మరొక ఐటీ టవర్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన రెండు ఐటీ కంపెనీలను పరిశీలించానని, బెల్లంపల్లి లాంటి చిన్న పట్టణంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నప్పుడు తెలంగాణలోని ఏ పట్టణంలోనైనా ఐటీ కార్యాలయాలను ఏర్పాటు చేసి నడపడం సులభమమేనని అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కార్యకలాపాలను నిర్వహించడంలో కంపెనీలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయని, ప్రస్తుతం పెరిగిన ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం సులభం అయిందని అన్నారు.
కంపెనీలతో ఒప్పందం
సమావేశం అనంతరం పలు కంపెనీల సీఈవోలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సుమారు 2500 ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. తెలంగాణలోని పట్టణాల్లో ఐటీ కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు తెలుగు ఎన్‌ఆర్‌ఐలతో పాటు అనేకమంది నాన్‌ తెలుగు ఎన్‌ఆర్‌ఐలు కూడా ముందుకొచ్చారు. ఐటీ సర్వ్‌ అలయన్స్‌ సంస్థ సహకారంతో ఈ సమావేశాన్ని టెక్నోజెన్‌ ఇంక్‌ సీఈఓ లక్స్‌ చేపూరి, మహేష్‌బిగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లు విజయవంతంగా నడపడానికి తమ వంతు సహకారం అందిస్తున్న లక్స్‌ చేపూరి, వంశీరెడ్డి, కార్తీక్‌ పొలసానిలను కేటీఆర్‌ అభినందించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు.
జీనోం వ్యాలీలో విస్తరణ ప్రణాళికలు
– జెనేసిస్‌ బయో టెక్నాలజీ ప్రకటన
– 50-60 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి
జెనేసిస్‌ బయోటెక్నాలజీ సంస్థ తన విస్తరణ ప్రణాళికలను శుక్రవారం ప్రకటించింది. అమెరికా పర్యటన లో ఉన్న మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. జెనసిస్‌ కంపెనీ విస్తరణ ప్రణాళికల పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఇన్సులిన్‌ ధరలు అందుబాటులోకి రావడంతో పాటు కోట్లాది మంది డయాబెటిస్‌ పేషెంట్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే జీనోమ్‌ వ్యాలీలో 50 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టిన కంపెనీ తాజాగా మరో 50 నుంచి 60 మిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడితో రీకాంబినెంట్‌ బల్క్‌ మ్యానుఫాక్చరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సంస్థకు 250 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారని, తాజా విస్తరణ ద్వారా మరో 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో జాప్‌కామ్‌ గ్రూప్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ
కరీంనగర్‌లో ఎక్లాట్‌ మెడికల్‌ కోడింగ్‌ సేవల కేంద్రం
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఎల్‌పీ ఆధారిత ఉత్పత్తులను తయారీలో పేరొందిన జాప్‌కాం కంపెనీ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఫైనాన్స్‌, టెక్నాలజీ, రిటైల్‌ రంగాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను ఈ కేంద్రం నుంచి తయారు చేయనుంది. అమెరికాతో పాటు భారత దేశంలోనూ జాబ్‌కాం తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో ముందుగా 500 మందిని సంవత్సరంలోగా మొత్తంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. మంత్రి కేటీఆర్‌తో జాఫ్‌కాం ఫౌండర్‌, సీఈఓ కిషోర్‌ పల్లంరెడ్డి సమావేశం అయ్యాక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు తాలూకు ప్రకటన చేశారు.
కరీంనగర్‌లో మెడికల్‌ కోడింగ్‌ కేంద్రం
ప్రపంచ ప్రఖ్యాత హెల్త్‌ కేర్‌ కంపెనీ 3ఎంకు మెడికల్‌ కోడింగ్‌ క్లినికల్‌ డాక్యుమెంటేషన్‌ సేవలను అందించేందుకు ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ కేంద్రాన్ని కరీంనగర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తొలుత 100 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే ఈ కేంద్రం భవిష్యత్తులో 200 మంది పనిచేయనున్నారు. కరీంనగర్‌లో తమ మెడికల్‌ కోడింగ్‌, సంబంధిత టెక్నాలజీ సర్వీసుల కేంద్రం ఇప్పటికే పనిచేస్తుందని, అనేక భారీ కంపెనీలకు పెద్ద ఎత్తున సేవలను అందిస్తున్నామని ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌ సీఈవో, ఫౌండర్‌ కార్తీక్‌ పోలసాని తెలిపారు.
ఏరోస్పేస్‌ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి
ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌
ఏరోస్పేస్‌ రగంలో తెలంగాణ రాష్ట్ర అద్భుత ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఎరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ స్టార్ట్‌అప్‌లు పాల్గొన్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. ఈ రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఏరోస్పేస్‌ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని, అనేక అమెరికన్‌ కంపెనీలు తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌ గురించి ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వ టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగం అత్యంత ప్రాధాన్యత రంగం అని అన్నారు. 2018, 2020 రెండేండ్లలో ఏరోస్పేస్‌ రంగానికి సంబంధించి తెలంగాణ ఉత్తమ రాష్ట్ర అవార్డుని అందుకుందని గుర్తుచేశారు.
ఈ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అనేక అవార్డులతో ఏరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులకు తెలంగాణనే అత్యుత్తమ గమ్యస్థానం అన్న విషయం నిరూపితమైందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల పట్ల సానుకూలపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ విధానాలను పెట్టుబడులకు రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రశంసించారు. తమతోపాటు తమ సప్లై చైన్‌లో ఉన్న ఇతర కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేస్తామని తెలిపారు.

Spread the love