రెండు రోజులు.. 26 అక్రమ రిజిస్ట్రేషన్లు

26-illegal-registrations-in-two-daysనవతెలంగాణ – వరంగల్
వరంగల్ జిల్లా ఖిలావరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కేవలం 48 గంటల్లో 26 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందుకు కారణమైన ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేశ్‌ను జిల్లా అధికారులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖిలా వరంగల్‌ కార్యాలయ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్తిక్‌ సెలవుపై వెళ్లడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజేశ్‌కు గత నెల 23న ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 44వ డివిజన్‌(సింగారం)లో వెలిసిన ఒక అక్రమ లేఅవుట్‌లోని ప్లాట్లకు రాజేశ్‌ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించినప్పుడు ప్రతి ప్లాటుకు నాలా పర్మిషన్‌ తీసుకోవాలి.. దీనికిగాను స్థిరాస్తి వ్యాపారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. వ్యవసాయ భూమి మొత్తానికి నాలా పర్మిషన్‌ తీసుకుని, వాటిని భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ నెల 18న 16 ప్లాట్లు, 20న 10 ప్లాట్లు కలిపి మొత్తం 26 ప్లాట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ వ్యవహారం తమ దృష్టికి రాగానే విచారణ చేసి.. వాటిలో లోపాలున్నాయని తెలియడంతో రాజేశ్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్‌ హరికోట్ల రవి తెలిపారు.

Spread the love