లాల్‌‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేసిన రాహుల్

నవతెలంగాణ -శ్రీనగర్
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’  చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగుతోంది. ప్రఖ్యాత లాల్ చౌక్ లో జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఎగురవేశారు. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ‘ఘంటా ఘర్’గా అత్యంత ప్రాచుర్యం ఉన్న క్లాక్ టవర్ చేరుకుని జాతీయ జెండా ఎగురవేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. లాల్‌చౌక్ వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన కార్యక్రమంలో రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరగగా, భద్రతా కారణాల దష్ట్యా లాల్‌చౌక్‌కు దారితీసే అన్ని రోడ్లను సీల్ చేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ముందస్తుగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, వారాంతపు మార్కెట్‌లు మూతపడ్డాయి. సెక్యూరిటీ డ్రిల్ సైతం నిర్వహించారు.

Spread the love