28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదు: మంత్రి బొత్స

నవతెలంగాణ – విశాఖపట్నం: ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్‌, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు. ప్రయాణించిన ఏపీ ప్రయాణికుల్లో 553 మంది సురక్షితంగా ఉన్నారని.. 92 మంది తాము ట్రావెల్‌ చేయలేదని తెలిపినట్లు చెప్పారు. మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదన్నారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా లొకేషన్లు గుర్తించి వారి ఇళ్లకు అధికారులను పంపి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని.. వారికి చికిత్స కొనసాగుతున్నట్లు బొత్స వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అమర్‌నాథ్‌, ఆరుగురు అధికారులు ఒడిశా వెళ్లి అక్కడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు చేరవేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Spread the love