– వేర్వేరు చోట్ల ఘటనలు
– నాగ్‌పూర్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
న్యూఢిల్లీ : వివిధ ప్రాంతాల్లోని మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో శనివారం అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలు బోగీలు దగ్ధమయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పూర్ సమీపంలో నిలిపేశారు. ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్..
కర్నాటకలోని బెంగళూరులో ఉన్న సంగోలి రాయన్న రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం 5:45 గంటలకు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిన తర్వాత ప్లాట్‌ఫామ్‌పై రైలును నిలిపివుంచారు. ఉదయం 7:10 గంటలకు రైలులోని బి1, బి2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్‌లో పొగలు దట్టంగా అలముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. రైలులో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 7:10 గంటలకు ప్రమాదం జరిగితే.. అగ్నిమాపక సిబ్బంది 7:35కు చేరుకున్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా…
ఉదరుపూర్-ఖజురహో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ సిటీలోని సిథోలి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును అక్కడికక్కడే నిలిపేశారు. ఇంజిన్‌లో మంటలు గురించి తెలియగానే ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. ముందుగా లోకో పైలట్ రైలింజన్‌లోంచి మంటలు రావడాన్ని గమనించారని, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంటు వ్యవస్థను పూర్తిగా ఆపేసి మంటలను అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన రైలు ఇంజిన్‌ను తొలగించి, మరో ఇంజిన్‌తో రైలును గమ్యస్థానానికి పంపినట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు.