నాట్కో ఫార్మా లాభాల్లో 345 శాతం వృద్థి

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 345 శాతం వృద్థితో రూ.275.8 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.50.5 కోట్లు, గడిచిన డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.62.3 కోట్ల చొప్పున లాభాలు ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ రెవెన్యూ క్రితం క్యూ4లో 51.80 శాతం పెరిగి రూ.926.9 కోట్లుగా చోటు చేసుకుంది. 2021-22 క్యూ4లో రూ.610.6 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం 2022-23లో స్థూలంగా నాట్కో రెవెన్యూ 37.6 శాతం పెరిగి రూ.2811.7 కోట్లుగా నమోదయ్యింది. కంపెనీ లాభాలు రూ.715.3 కోట్లుగా ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది రూ.170 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. బ్రిటన్‌ కంపెనీ జిస్టా ఫార్మాను పూర్తిగా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపింది. అదే విధంగా కొలంబియాలో లక్ష డాలర్ల లోపు పెట్టుబడితో అక్కడ ఓ సబ్సీడరీ కంపెనీని ఏర్పాటు చేయను న్నట్లు వెల్లడించింది. సోమవారం బిఎస్‌ఇలో నాట్కో షేర్‌ విలువ 0.91 శాతం పెరిగి రూ.635.10 వద్ద ముగిసింది.

Spread the love