4న ఇందిరాపార్క్‌ వద్ద కార్మిక గర్జన : ఐఎఫ్‌టీయూ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ఈనెల నాలుగో తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద కార్మిక గర్జన నిర్వహిస్తున్నది. సోమవారం విద్యానగర్‌లోని మార్క్స్‌భవన్‌లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం పాల్గొనాలని ఐఎఫ్‌టీయూ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఎస్‌ఎల్‌ పద్మ, కార్యదర్శి వి ప్రవీణ్‌ పిలుపునిచ్చారు. కనీస వేతనాలు జీవోలను విడుదల చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్‌ చేయాలనీ, ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలనీ, మీటర్‌ చార్జీలను పెంచాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలను చెల్లించాలనీ, భవన నిర్మాణ కార్మికులకు వివిధ ప్రయోజనాలను ఇప్పటి ధరలకనుగుణంగా ప్యాకేజీలను పెంచాలని చెప్పారు. కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు, యూఆర్‌ఎస్‌లలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌, వర్కర్లకు చెల్లించే వేతనాల్లో బేసిక్‌పేని నిర్ణయించి ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. కార్మిక ప్రయోజనాలను రక్షించని ఈ ప్రభుత్వాలని కార్మికులు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

Spread the love