– పదేండ్లలో పేరుకుపోయిన పెండింగులు
– పూర్తి స్థాయి బడ్జెట్‌కు అసలు సిసలు సవాళ్లివే
– అధిగమించేందుకు అప్పులే శరణ్యమా..?
– ఆదాయ, వ్యయాల సమతూకమే విత్తమంత్రికి చిక్కుముడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేండ్ల నిర్వాకం వల్ల రూ.30 వేల కోట్ల మేర బిల్లులు పేరుకుపోయాయి. అవి మాకు పెనుభారంగా మారాయి. వాటిని చెల్లించటంతోపాటు, అప్పులు, వాటికయ్యే వడ్డీలను కట్టటమే మాకు పెద్ద సవాల్…’ కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలివి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు లెక్కలేయగా… డిప్యూటీ సీఎం చెప్పిన దానికంటే ఎక్కువగా పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని తేలింది. 2014 నుంచి 2023 డిసెంబరు వరకు మొత్తం నాలుగు లక్షల బిల్లులకుగాను ప్రభుత్వం రూ.40 వేల కోట్ల మేర బకాయి పడిందని ఆ లెక్కల్లో తేలింది. విద్యుత్ సంస్థలకు ఇచ్చే బిల్లులు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు, వివిధ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ బిల్లులు, ఆరోగ్య శ్రీ, పాలీహౌస్, గ్రీన్‌హౌస్‌లు, సర్పంచులు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులన్నీ కలిపి రూ.40 వేలకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈనెల 25న ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ బకాయిలు, పెండింగ్ బిల్లులే సర్కారుకు అసలు సిసలు సవాళ్లుగా మారనున్నాయి. పద్దులో వీటిని ఏ రకంగా పొందుపరుస్తారు? వాటిని చెల్లించేందుకు ఎలాంటి ఆదాయ మార్గాలను ఎంచుకుంటా రనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రైతు రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయి. రైతు భరోసా (రైతు బంధు)కు సగటున మరో రూ.7 వేల కోట్లు కావాలన్నది ఆర్థికశాఖ అంచనా. వెరసి ఇప్పటికిప్పుడు ఈ రెండు పథకాలకు రూ.38 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చుకోవాలి. ఇవిగాక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మే చివరి వరకూ రూ.7,380 కోట్ల అప్పులు చేసింది. వాటికి వడ్డీల రూపంలో ఇప్పటి వరకూ రూ.3,729 కోట్లను చెల్లించారు. ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.7,572 కోట్లను, పెన్షన్ల కోసం మరో రూ.2,627 కోట్లను చెల్లించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు విశదీకరిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఇప్పటి వరకూ నమోదైన గణాంకాలివి. అయితే ప్రతీయేటా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకూ నాలుగు నెలలుపోను మిగతా ఎనిమిది నెలల కోసం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిధులను కేటాయించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ఖజానాకు మే చివరి నాటికి పన్నుల ద్వారా రూ.23,147 కోట్ల ఆదాయం సమకూరింది. రాబడి ఇలా ఉండగా… అన్ని అంశాలకు కలిపి ప్రభుత్వం 23,476 కోట్లను ఖర్చు పెట్టింది. దీంతో ఈ కాలంలో రెవెన్యూ లోటు రూ.329 కోట్లుగానూ, ద్రవ్య లోటు రూ.7,380 కోట్లుగానూ నమోదైంది. ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు విత్తమంత్రి భట్టి విక్రమార్క తన పూర్తి స్థాయి పద్దులో వీటిని ఎలా సమన్వయ పరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. వివిధ ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా ఆర్బీఐ వద్ద బాండ్లను తాకట్టు పెట్టటం ద్వారా ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని, ఆదాయాన్ని సమకూర్చుకోనుందని సమాచారం. దీంతోపాటు అదనపు నిధుల కోసం ప్రభుత్వ భూముల అమ్మకాలు తప్పనిసరనే వాదన కూడా వినిపిస్తోంది.