నేడు 4 పథకాలు ప్రారంభం

4 schemes start today– రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు
– సమీక్షించిన సీఎం రేవంత్‌ రెడ్డి
– వివరాలు వెల్లడించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నేడు (ఆదివారం) రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డులు నాలుగు పథకాలు లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ నాలుగు పథకాలను ఆదివారం నుంచి ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. లక్షలాది సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జనవరి 26న అత్యంత పరమ పవిత్రమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ సంక్షేమ పథకాల అమలును ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నూరు శాతం ఆ గ్రామంలో ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. లక్షలాదిగా వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉదాత్త ఉన్నతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ రాజ్యం అని తెలిపారు.అంతకు ముందు ఆ నాలుగు పథకాలపై సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నేడు నారాయణపేట జిల్లాలో
సీఎం రేవంత్‌ రెడ్డి నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా కొస్గి మండలం, చంద్రవంచ గ్రామంలో మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

Spread the love