మణిపూర్‌లో విద్యార్థులపై లాఠీచార్జి : 40 మందికి గాయాలు

నవతెలంగాణ- ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఇంకా ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఇంఫాల్‌లో విద్యార్థులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం, లాఠీచార్జి చేయడంతో 40 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో జులైలో గల్లంతైన ఇద్దరు యువకులు హత్యకు గురైనట్లు తాజాగా వెల్లడయింది. దీనికి నిరసనగా మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. మణిపూర్‌లో గతంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హింసాకాండ నేపథ్యంలో విధించిన ఇంటర్నెట్‌ నిషేధాన్ని గతవారంలో ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

Spread the love