టన్నెల్‌లోనే 40 మంది కార్మికులు

నవతెలంగాణ – డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిన ఘటనలో కార్మికులు క్షేమంగానే ఉన్నారు. వారికి నీరు, ఆహారం అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, చిక్కుకున్న కార్మికులను రక్షించటం కోసం సహాయ చర్యలకు మరో రెండు రోజులు పట్టవచ్చని చెప్పారు. బ్రహ్మఖాల్‌-యమునోత్రిపై సిల్‌క్యారా, దండల్‌గావ్‌ మధ్య చార్‌దామ్‌ మార్గంలో నిర్మాణంలో ఉన్న సొరంగం ఆదివారం తెల్లవారుజామున కూలి 40 మంది కార్మికులు చిక్కుకున్న ఘటన తెలిసిందే. అయితే, చిక్కుకుపోయిన కార్మికులంతా క్షేమమేననీ, వారితో కమ్యూనికేషన్‌ జరుపుతున్నట్టు అధికారులు వివరించారని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఆదివారం ఘటన జరిగిన అనంతరం సహాయక చర్యలను మొదలు పెట్టిన తక్షణమే చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్‌ను అందించారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి కార్మికులతో కమ్యూనికేషన్‌ ఏర్పడిన తర్వాత వారికి తాగటానికి నీరు, తేలికపాటి ఆహారాన్ని అందించినట్టు అధికారులు వివరించారు. మంగళవారం రాత్రికి లేదా బుధవారం నాటికి కార్మికులను బయటకు తీసే అవకాశం ఉన్నదని ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన సెక్రెటరీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రంజిత్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు.

Spread the love