– సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 26 వరకు గడువు
– నేటి నుంచి మూడోవిడత కౌన్సెలింగ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు సంబంధించి రెండో విడత సీట్లను ఉన్నత విద్యామండలి మంగళవారం కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం, దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోస్త్ రెండో విడతలో 44,803 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. వారిలో 41,533 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. అందులో 7,039 మంది మెరుగైన సీట్లను పొందారని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యత ద్వారా 28,838 మంది, రెండో ప్రాధాన్యత ద్వారా 12,695 మంది సీట్లు సాధించారని వివరించారు. విద్యార్థులు తక్కువ వెబ్ఆప్షన్లను నమోదు చేయడం వల్ల 3,270 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. రెండో విడతలో ఆర్ట్స్‌లో 4,884 మందికి, కామర్స్‌లో 14,012 మందికి, లైఫ్ సైన్సెస్‌లో 8,791 మందికి, ఫిజికల్ సైన్స్‌లో 9,727 మందికి, డీ ఫార్మసీలో 75 మందికి, ఇతర కోర్సుల్లో 4,044 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్తులు ఈనెల 26 వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. మొదటివిడతలో సీటు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకు రెండో విడతలో సీటు కేటాయిస్తే వారు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. లేదంటే ఆ సీటు రద్దవుతుందని తెలిపారు. రెండో విడతలో సీటు కేటాయిస్తే మొదటి విడతలో సీటు రద్దవు తుందని వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మెరుగైన సీటు కోసం మూడో విడతలో మళ్లీ వెబ్ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. మూడో విడత సీట్ల కేటాయింపు తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు వచ్చేనెల ఎనిమిది నుంచి 12 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. రిపోర్టు చేయకుంటే ఆ విద్యార్థి సీటును కోల్పోతారని తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను దృష్టిలో ఉంచు కుని మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూ ల్ను సవరించామని పేర్కొన్నారు. బుధవారం నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. వచ్చేనెల రెండో తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. బుధవారం నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ఆరో తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు.