నవతెలంగాణ – కెన్యా : కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న కెన్యాలో ఓ డ్యామ్ తెగిపోయి బీభత్సం సృష్టించింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు తెగిపోయాయి. ఇప్పటివరకు 42 మంది మృత దేహాలను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోవడంతో.. చాలా మంది ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఇళ్ల శిథిలాల్లో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.