4 నెలలు.. 44 కోట్లు

– ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు
– విచ్చలవిడిగా ఖర్చు చేసిన కర్నాటక బీజేపీ ప్రభుత్వం
– రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బొమ్మై సర్కారు నిర్వాకం : ఆర్టీఐ సమాచారంలో వెల్లడి
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ప్రకటనలపై కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేసింది. కోట్లాది రూపాయలను కుమ్మరించి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలను ఇచ్చింది. ఇలా కేవలం నాలుగు నెలల్లోనే రూ. 44 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ సమాచారం ప్రకారం.. గతేడాది డిసెంబర్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 29 మధ్య.. కర్నాటక బీజేపీ ప్రభుత్వం మొత్తం నాలుగు నెలల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనల కోసం రూ.44.42 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రింట్‌ మీడియా కోసం రూ.27.46 కోట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రకటనల కోసం రూ. 16.96 కోట్లు వెచ్చించింది. అయితే, బొమ్మై సర్కారు తన ప్రకటనల బడ్జెట్‌ను ఖర్చు చేసిన మీడియా సంస్థల గురించి మాత్రం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ వివరాలను వెల్లడించలేదు. కర్నాటకలో షెడ్యూల్‌ ప్రకారం మే 10న 224 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అత్యధికంగా 135 స్థానాలను గెలిచి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోగా.. 66 సీట్లతో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది.
ప్రజా ధనాన్ని లూటీ చేసిన బీజేపీ ప్రభుత్వం : కాంగ్రెస్‌
ప్రభుత్వాలు తమ పథకాలపై అవగాహన కల్పిం చేందుకు బడ్జెట్‌ను కేటాయించటం విలక్షనమైన ప్పటికీ.. రాష్ట్రంలో అధికారాన్ని పొందాలనే ఏకైక లక్ష్యంతో ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపు దారుల సొమ్మును విపరీతంగా ఖర్చు చేయటం సరి కాదని ఆర్టీఐ కింద దరఖాస్తును దాఖలు చేసిన పుత్తూరుకు చెందిన కృష్ణప్రసాద్‌ అన్నారు. బీజేపీ దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసిందనీ, ప్రతి పక్షాలను విమర్శించేందుకే కొన్ని ప్రకటనలను ఇచ్చా రని తెలిపారు. బొమ్మై ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసిందని కర్నాటక కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బి.ఎస్‌ శివన్న ఆరోపించారు. పథకాల ప్రచారాల పేరుతో విపక్షాలను ఎదుర్కోవడానికి బీజేపీ దానిని రాజకీయంగా ఒక సాధనంగా వాడుకున్నదని ఆయన అన్నారు.

Spread the love