కాలువలో పడ్డ కారు.. ఒకే కుటుంబంలో 5గురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్పత్రికి వెళ్తుండగా కాలువలో పడ్డ కారు.. ఒకే కుటుంబంలో 5గురు మృతి ఆస్పత్రికి వెళ్తుండగా ఓ కారు వేగంగా దూసుకెళ్లి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ​ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. చివరకు ఐదుగురి మృత దేహాలను బయటకు తీశారు. దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేవర్ బ్యారేజీ వద్ద ఈ ఘటన జరిగినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా కస్గంజ్‌లోని గంజ్‌దుండ్వారా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఓ అమ్మాయికి చికిత్స చేయించడానికి ఎటాలోని ఓ ఆస్పత్రికి వెళ్తున్నారు. మార్గ మధ్యలో వేగంగా వెళ్లడం వల్ల కారు అదుపు తప్పి కాలువలో పడిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love