దివాళా అంచున 50దేశాలు!

అభివృద్ధి చెందుతున్న దేశాల రుణభార ధీనగాధను గురించి భారతదేశంలో జరుగుతున్న జి-20 దేశాల మంత్రుల సమావేశంలో ఐక్యరాజ్య సమితి డెవెలప్మెంట్‌ ప్రోగ్రాం(యుఎన్‌ డిపి) వివరించింది. గతవారంలో ప్రపంచంలోని సగం దేశాలు ప్రభుత్వ రుణభారంతో ప్రమాదంలో పడ్డాయని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో పేర్కొంది.
గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ లో జరిగిన జి-20 దేశాల ప్రతినిధుల సమావేశంలో వర్దమాన దేశాల రుణభారంపై చేసిన చర్చలో ఎటువంటి పురోగతి లేదని అసోషియేటెడ్‌ ప్రెస్‌ రిపోర్ట్‌ చేసింది. 2023 జులై వరకు అభివ్రుద్ధి చెందుతున్న దేశాల రుణభారాన్ని పున్ణనిర్మించటంపైన ఆశించిన పురోగతి లేదని, ఇది ఆందోళన కలిగించే విషయమని యుఎన్‌ డిపి అడ్మినిస్ట్రేటర్‌ అచిమ్‌ స్టైనర్‌ రాయిటర్స్‌ కి చెప్పాడు.
రుణభారాన్ని తగ్గించుకునే అవకాశంలేక 52దేశాలు దివాళా దిశగా పయనిస్తున్నాయని గతవారం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గ్యుటెర్రెస్‌ హెచ్చరించాడు. పెరుగుతున్న రుణ సమస్యపట్ల వాణిజ్యం, అభివ్రుద్ధిపైన ఐక్యరాజ్య సమితి సమావేశం(యుఎన్‌ సి టి ఏడి) నివేదికలోని విషయాలను గురించి ఆయన మాట్లాడాడు. 330కోట్లమంది ప్రజలు నివసిస్తున్న దేశాలు తాము ఆరోగ్యంపైన లేక విద్యపైన చేస్తున్న వ్యయం కంటే చేసిన అప్పులపైన కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని గ్యుటెర్రెస్‌ అన్నాడు. ‘ఇది వ్యవస్థ ప్రమాదంలో పడటంకంటే ఎక్కువ. ఇది వ్యవస్థా వైఫల్యం’ అని ఆయన అన్నాడు.
అఎన్‌ సిటిఏడి ప్రకారం కనీసం 19వర్దమాన దేశాలు తాము విద్యమీద చేస్తున్న వ్యయం కంటే వడ్డీ ఎక్కువగా కడుతున్నాయి. మరో 45 దేశాలు ఆరోగ్య సంరక్షణ మీద చేసే వ్యయం కంటే వడ్డీ మీద ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. సదరు ఐక్యరాజ్య సమితి ఏజన్సీ ప్రకారం ప్రపంచం లో 40శాతం ఆందోళనకర స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ వ్యవస్థలోనే అంతర్లీనంగా అసమానత్వం ఉండటం, అది వర్దమాన దేశాలపైన అసమంగా భారం కావటం అన్నింటికంటే ఆందోళన కలిగించే అంశమని అఎన్‌ సిటిఏడి పేర్కొంది.
ఆఫ్రికా దేశాలు కడుతున్న వడ్డీ అమెరికా కంటే నాలుగు రెట్లు, సంపన్న ఐరోపా దేశాలకంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంది. గత దశాబ్దంలో 47శాతంగావున్న ప్రయివేటు రుణ దాతలు నేడు 62శాతానికి పెరగటంవల్ల ఈ రుణాలను పున్ణనిర్మించటం కష్టంగా మారింది. 2022లో ప్రపంచంలోని ప్రభుత్వాల రుణం ఎన్నడూలేనంతగా 92ట్రిల్లియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 2000సంవత్సరంతో పోల్చినప్పుడు ఐదు రెట్లు పెరిగింది. కోవిడ్‌-19 మహమ్మారి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరగటమే దీనికి కారణమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ప్రపంచ జనాభాలో 20శాతం లేక 165కోట్ల ప్రజలు రోజుకు 3.65డాలర్ల (292 రూపాయల) కంటే తక్కువ ఆదాయంతో బ్రతుకుతున్నారనే వాస్తవం ఆందోళన కలిగించే అంశమని ఐక్యరాజ్యసమితి తన ఆవేదనను వెలిబుచ్చింది.

Spread the love