కిలో @ 50

50 @ kg– మళ్లీ ఘాటెక్కిన ఉల్లి
– నిన్నటి దాకా వందకు ఐదు కిలోలు ఇపుడు రెండు కిలోలే..
– పక్షం రోజుల్లో 30-50 శాతం పెరుగుదల
– డిమాండ్‌, సరఫరాల మధ్య వ్యత్యాసం
– కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
– సబ్సిడీ ధరతో విక్రయించడానికి చొరవ చూపని ప్రభుత్వాలు
ఉల్లి మరోసారి ఘాటెక్కింది. గత పక్షం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. సరఫరా తగ్గటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. మరోవైపు బక్రీద్‌ పండుగ సమీపిస్తుండడంతో ఉల్లికి డిమాండ్‌ పెరిగింది. నిన్నటి దాకా వందరూపాయలకు ఐదు నుంచి ఏడు కిలోలకు లభ్యమయ్యేది. ఇపుడు కిలో యాభై పలుకుతోంది. డిమాండ్‌, సరఫరాల మధ్య వ్యత్యాసం కారణంగా ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. దీనికితోడు కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతు న్నాయి. నాసిక్‌లోని లాసాల్‌గాన్‌ మండిలో గత నెల 25న కిలో ఉల్లిగడ్డ ధర రూ.17 పలకగా సోమవారం అది రూ.26కు చేరింది. నాణ్యమైన ఉల్లి కావాలంటే రూ.30 చెల్లించాల్సి వస్తోంది. ఉల్లిగడ్డలు జూన్‌ నెల నుండి మార్కెట్‌కు వస్తుంటాయి. రైతులు, వ్యాపారులు వాటిని తమ వద్దే నిల్వ చేస్తారు.
రబీ సీజన్‌లో దిగుబడులు తగ్గిన నేపథ్యంలో ఉల్లి ధర రూ. 50కి చేరింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు ఆశిస్తున్నారు. ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేసియా తదితర దేశాలకు ఉల్లి ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. గత నెలలో ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన తర్వాత నాసిక్‌ జిల్లా నుండి ప్రతి రోజూ సగటున మూడు వేల టన్నుల ఉల్లిగడ్డలతో కంటైనర్లు తరలిపోతున్నాయని ఓ వ్యాపారి తెలిపారు. దీనివల్ల దేశంలో ఉల్లికి డిమాండ్‌ పెరిగిందని ఆయన చెప్పారు.
ముఖ్యంగా మహారాష్ట్రలో పండే ఉల్లికి దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్రమైన డిమాండ్‌ ఉంటోంది. ధరలు పెరిగే వరకూ వారు తమ వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌కు పంపబోరని, అందుకే కృత్రిమ కొరత ఏర్పడి ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయని చెబుతున్నారు.
తెలంగాణలోనూ..
తెలంగాణ జనాభా అవసరాలకు తగినట్టు ఐసీఎంఆర్‌ రిపోర్టు ప్రకారం 41.75 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరమంటోంది. ప్రోఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) ప్రకారం 22.32 లక్షల మెట్రిక్‌ టన్నులు సరిపోతాయని అంచనా. వికారాబాద్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. ఇక్కడ పండించే ఉల్లి సరిపోక పక్క రాష్ట్రాలైన ఏపీ నుంచి కూడా వస్తోంది. దేశంలోనే అత్యధికంగా ఉల్లి పంట పండించే మహారాష్ట్ర నాసిక్‌ నుంచే అత్యధికంగా సరఫరా అవుతోంది. అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలతో పేద,మధ్యతరగతి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్‌లో సబ్సిడీ ధరపై ఉల్లి విక్రయించాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Spread the love