54 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. విద్యాశాఖ జీవో జారీ

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు. 2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవోను జారీచేశారు. ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, డైట్‌కాలేజీల్లో పనిచేస్తూనే, ఉత్తమ సేవలందించినందుకు గాను వీరిని అవార్డులు వరించాయి. హెడ్‌ మాస్టర్‌ కేటగిరిలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరిలో 20 మంది, ఎస్జీటీ/ టీజీటీ/ పీజీటీ కేటగిరిలో 11 మంది, డైట్‌ లెక్చరర్‌ కేటగిరిలో ఒకరు, స్పెషల్‌ కేటగిరిలో 12 మంది టీచర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గురుపూజోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో సన్మానిస్తారు. అలాగే అవార్డు కింద రూ. 10వేల నగదుతో పాటు సర్టిఫికేట్‌, మెడల్‌ అందజేస్తారు.

Spread the love