బీజేపీ నాయుకుని ఇంట్లో రూ.55లక్షలు పట్టివేత

– సొంత పార్టీ నాయకులే ఫిర్యాదు చేసినట్టు పుకార్లు
నవతెలంగాణ-హాజీపూర్‌
కిసాన్‌ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకటరమణారావు ఇంట్లో సోమవారం రాత్రి రూ.55లక్షలను ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..హాజీపూర్‌ మండల కేంద్రంలోని రమణారావు ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేని రూ.55లక్షలను గుర్తించి సీజ్‌ చేశారు. ఈ సోదాల్లో ఎఫ్‌ఎస్టీ సభ్యులు రాజన్న, ఎఎస్‌ఐ రాములు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు సర్పంచులను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వెంకటరమణరావు స్థానిక నాయకులను పట్టించుకోకుండా ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇష్టారీతిన కొనుగోలు కార్యక్రమాలు చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. సదరు నాయకుడు పార్టీ సీనియర్లను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతోనే సొంత పార్టీకి చెందిన వారే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మండలంలో చర్చ జరుగుతోంది.

Spread the love