వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటులో 5,540 పోస్టులు ఖాళీ

– ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ
న్యూఢిల్లీ .వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటులో 5,540 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర స్టీల్‌ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్థే తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 జులై 1 నాటికి దేశంలోని స్టీల్‌ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 8,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటులోనే 5,540 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటులోని పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని అన్నారు.
సెయిల్‌లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు విలీనం చేయం
సెయిల్‌లో వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు విలీనం చేసే ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి ఫగ్గస్‌ సింగ్‌ కులస్థే తెలిపారు. బీజేపీ ఎంపీ జివిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధనం ఇచ్చారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంటులో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు 2021-22లో రూ.3,174.54 కోట్ల నికర విలువ ఉండగా, రూ.913.19 కోట్లు లాభం ఆర్జించిందని లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీలు జి.రంజిత్‌ రెడ్డి, వెంకటేష్‌ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు.
రైల్వేలో 2,61,233 పోస్టులు ఖాళీలు
రైల్వేలో 2,61,233 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జులై 1 నాటికి మొత్తం రైల్వేలో 2,61,233 ఖాళీలుండగా, అందులో ఆపరేషనల్‌ సేఫ్టీ కేటగిరిలో 53,178 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Spread the love