నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండల పరిధిలోని వెంకటగిరి క్రాస్‌రోడ్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం కలిపి సుమారు రూ.63లక్షల నగదు, 275 గ్రాముల బంగారంని పోలీసులు సీజ్ చేశారు. ఏపీలోని జగ్గయ్యపేటకి చెందిన పవన్ జగ్గయ్యపేట నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆ కారును వెంకటగిరి క్రాస్ రోడ్ లోని చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీ చేయగా కారులో రూ.20,55,000లు నగదు, 275 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. నగదు, బంగారంకి సంబంధించి ఎటువంటి ఆధారపత్రాలు లేకపోవడంతో నగదు, బంగారంను పోలీసులు సీజ్ చేశారు. కొత్తగూడెంకి చెందిన రజనీకాంత్ ఆర్టీసీ బస్సులో కోదాడ వెళ్లి తిరిగి కొత్తగూడెం వెళ్తున్నాడు. మండలంలోని వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా రజనీకాంత్ వద్ద రూ.42,86,520లు ఉన్నట్లు గుర్తించారు. నగదుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదు, బంగారంని ఎన్నికల అధికారులకు అప్పగిం చినట్లు ఎస్‌ఐ పుష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున డబ్బులు తీసుకెళ్లడం సరికాదని, ఒకవేళ తప్పనిసరిగా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సంబంధించిన బిల్లులు కాని ఆధారపత్రాలను గాని తమ వెంట తీసుకువెళ్లాలని ఎస్‌ఐ సూచించారు.