నవతెలంగాణ – కరీంనగర్
పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సులు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయని, కరీంనగర్ రీజియన్‌కు పలు రూట్‌లలో మొత్తం 70 బస్సులు కేటాయించినట్టు కరీంనగర్ రీజియన్ రీజనల్ మేనేజర్ ఎన్.సుచరిత తెలిపారు. కరీంనగర్-జేబీఎస్ 33, కరీంనగర్ జేబీఎస్ 6, కరీంనగర్-గోదావరిఖని 9, కరీంనగర్-మంథని 4, కరీంనగర్-కామారెడ్డి 6, కరీంనగర్-జగిత్యాల 6, కరీంనగర్-సిరిసిల్ల (నాన్‌స్టాఫ్) 6 మొత్తం 70 బస్సులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో తొలి విడతగా 33 సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ 33 బస్సులు కరీంనగర్-హైదరాబాద్ రూట్‌లో అద్దె ప్రాతిపదికన (జీసీసీ-గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) నడపబడతాయని, వీటి పర్యవేక్షణ, ఆపరేషన్స్ మొత్తం ఆర్టీసీయే చూసుకుంటుందన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లలో భాగంగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మౌలిక వసతుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత అతి త్వరలో ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలిపారు.