గిరిజనబంధు

– గిరిజనుల ఎదురు చూపులు
– రుణాలందక అవస్థలు పడుతున్న యువత
– బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవటంపై అనుమానాలు
– హామీని అమలు చేస్తామంటున్న మంత్రి
గిరిజనం బతుకు దుర్భరంగా మారుతోంది. పాలకులు మారినా తమ తలరాతలు మారటంలేదన్న ఆవేదన,ఆగహ్రం పెల్లుబుకుతోంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటన వారిలో కొంత ఊరట నిచ్చింది. అయితే దీనిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. దీనికి కార్యాచరణ అవసరమని గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజనులను ‘గిరిజనబంధు’ పథకం ఊరిస్తున్నది. దళిత బంధు లాగానే గిరిజన బంధుకూడా అమలు చేస్తామంటూ పొయినేడాది సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లతోపాటు గిరిజన బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఐదు నెల్లు దాటినా గిరిజనబంధుపై స్పష్టత రాకపోవటంతో గిరిజనుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమలుకు నోచుకోని పథకాలు..
గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు తగిన విధంగా లబ్దిదారులకు చేకూరటం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో 32 గిరిజజన తెగలున్నాయి.2011 జనాభా లెక్కల ప్రకారం 31.78 లక్షల జనాభా ఉండగా..తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం36,02,288మంది (9.91శాతం) గిరిజనులున్నారు. ఇందులో మైదాన ప్రాంత గిరిజనులు 20,44,039 (64శాతం) ఉండగా, మిగతా వివిధ తెగలతో కూడిన ఆదివాసీలున్నారు. వీరి అభివృద్ధికోసం ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయాలి. పథకాల అమలు తీరుపై పరిశీలన పెరగాలి. అరకొర నిధులు కేటాయిస్తున్నా..వాటిని ఖర్చు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి.ఈ నేపథ్యంలోనే దళిత బంధు మాదిరిగా గిరిజన బంధు ప్రకటించాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది.
పట్టాలెక్కని పథకం..
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధు ప్రకటించినప్పటికీ..తగిన విధి విధానాలను ప్రక టించకపోవటంపై గిరిజనులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజన బంధుకు నిధులు కేటాయించకపోవ టంతో పథకాన్ని పట్టాలెక్కిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతియేటా బడ్జెట్లో గిరిజనులకు కేటాయించిన విధంగానే ఈ ఏడాది కూడా కేటాయింపులు ఉండటం విశేషం. వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఏటా 29శాఖలు కలిపి గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి పద్దు కింద గతేడాది రూ.13,412 కోట్లు కేటాయించగా 2023-24లో రూ.15,233 కోట్లు కేటాయించింది. గిరిజన సంక్షేమ శాఖకు గతేడాది రూ.2,847 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ.3,965 కోట్లు కేటాయించింది. దీంతో గిరిజనుల అభివద్ధి సంక్షేమానికి ఖర్చు చేసే సంక్షేమ శాఖకు కేవలం రూ.3,965 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవటమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క వివిధ శాఖల్లో కేటాయిస్తున్న గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధులు గిరిజనుల కోసం ఖర్చు చేయకుండా వేలకోట్లు ఇతర పథకాలకు దారి మళ్ళిస్తుందన్న ఆరోపణలున్నాయి. ఇది సబ్‌ ప్లాన్‌ చట్టానికి తిలోదకాలు ఇవ్వడమేనని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే..గిరిజన బంధుకు ఎక్కడనుంచి ఖర్చు చేస్తారో స్పష్టత ఇవ్వాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.
కార్పొరేషన్ల లోన్లు ఇవ్వటం లేదు..
ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో మాదిరిగానే గిరిజన కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ లోన్లు అందటం లేదు. గిరిజన యువత కోసం తీసుకొచ్చిన డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం మూడేండ్లుగా అమలు చేయడం లేదు. ఈ పథకానికి కేటాయించటం లేదు.దీనికోసం సుమారు లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎనిమిదేండ్లలో 34,873 మందికి మాత్రమే ఈ పథకం కింద లబ్దిపొందారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎకానమిక్‌ సపోర్ట్‌ స్కీం(ఈఎస్‌ఎస్‌)ను కూడా అమలు చేయడం లేదు. ఈ ఎనిమిదేండ్లలో 1,120 మందికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో గిరిజనబంధు ప్రకటించి మిగతా పథకాలకు చెక్‌ పెడతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
హక్కు పత్రాలు జారీ చేస్తేనే..
గిరిజన బంధుపథకాన్ని ప్రకటించిన సమయంలోనే భూమి లేని గిరిజనులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని సీఎం చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి ముందుగా పోడు భూములకు పట్టాలివ్వనిదే అర్హుల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడం లేదు. పోడు భూముల హక్కు పత్రాల జారీలో జరుగుతున్న ఆలస్యమే ఇప్పుడు ఈ పథకం అమలుకు అడ్డంకిగా మారిందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించినట్టుగా గిరిజన బంధును అమలు చేసి తీరుతామంటూ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడిస్తున్నారు. దీనిపై గిరిజనులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.

Spread the love