నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన 78 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్టు గార్డు బృందం అదుపులోకి తీసుకుంది. భారత్ సరిహద్దులోని అంతర్జాతీయ జలాల్లో పహారా కాస్తున్న కోస్టుగార్డు సిబ్బందికి రెండు బోట్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని వెంబడించి అడ్డుకున్న కోస్టుగార్డు సిబ్బంది.. బోట్లు బంగ్లాదేశ్‌లో రిజిస్టరై ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ప్రయాణిస్తున్న 78 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకొని, బోట్లను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వాటిని పారాదీప్ పంపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో సరిహద్దులోని ఇండియన్ కోస్టుగార్డ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి జలమార్గంలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే అవకాశం ఉన్న తరుణంలో అంతర్జాతీయ జలాల్లో పెట్రోలింగ్ షురూ చేశారు. ఏ చిన్న అనుమానం వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమాయాల్లో కోల్‌కతా నుంచి భువనేశ్వర్ వరకు ఎయిర్‌క్రాఫ్ట్‌లతోనూ పహారా కాస్తున్నారు.