– వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు
– బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్
– మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసమే తక్కువ నష్టంతో కూడిన స్టీల్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లరుఓవర్లు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నదని వివరించారు. వీఎస్‌టీ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను శనివారంనాడాయన పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావల్సిన గడువు ముగిసినా, పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మూడు నెలల్లో బ్రిడ్జి పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సెంట్రల్ హైదరాబాద్ నగరానికే ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాల్లో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్మికులకు, పౌరులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరాపార్కు నుంచి పనులను పరిశీలిస్తూ మంత్రి కాలినడకన వీఎస్‌టీ వరకు వెళ్లారు. అక్కడ పూర్తయిన ర్యాంపు పైకి వెళ్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం రూ.440 కోట్లు జిహెచ్‌ఎంసి ఖర్చు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజక వర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉన్నదన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు పూర్తికావచ్చిందని చెప్పారు. అనంతరం ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు పనులను మంత్రి పరిశీలించారు. హుస్సేన్ సాగర్ మిగులు నాలాలో చేపడుతున్న పనులు, అశోక్‌నగర్ వద్ద నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మంత్రి వెంట ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు జీహౌచ్‌ఎంసీ అధికారులు ఉన్నారు.