భువనగిరి గురుకుల పాఠశాలలో 8 మందికి అస్వస్థత

– ఏరియా ఆసుపత్రికి తరలింపు
– కలుషిత ఆహారమే కారణం
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో  కలుషిత ఆహారం తిని ఎనిమిది మంది  విద్యార్థులు శనివారం అస్వస్థత గురయ్యారు. హుటాహుటిన తెల్లవారుజామున వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి తిన్న ఆహారమే కారణమని పేర్కొంటున్నారు. గురుకుల పాఠశాలకు చెందిన టీ కార్తిక్,  ఎం శ్రీవత్సవ, ఏ అజయ్, బి భవిష్, అజయ్, పి రిషిత్, ఎం జస్వంత్, పి జస్వంతులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఒక విద్యార్థి వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. 6 గంటల 30 నిమిషాలకు మరో విద్యార్థి కడుపునొప్పి అంటూ బాధ పడ్డాడు. దీంతో ఇద్దరిని చేర్పించిన తర్వాత ఉదయం 11 గంటలకు మరో ఆరుగురు విరోచనాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. కలుషిత ఆహారం తీసుకోవడంతోటే కడుపునొప్పి విరోచనాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. మిగతా విద్యార్థులను డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు విద్యార్థుల యొక్క పరిస్థితిని తెలుసుకొని ఆరా తీశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలుషిత ఆహారానికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్
భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విషపు ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థుల మౌలిక సదుపాయాలు లేక సరైన దృష్టి లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పౌష్టికాహారం సరిగ్గా అందించకపోవడం వల్ల అనారోగ్యం భారిన పడుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు హాస్టల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారు అన్నారు.  విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. వీరితోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్,  పాల్గొన్నారు.
పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం:
గురుకుల పాఠశాలలో ప్రస్తుత ఆహారంతో ఆసుపత్రుల పాలైన విద్యార్థులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల ద్వారా విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు కావాలంటే నిమ్స్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులను పరామర్శించిన బూర నరసయ్య గౌడ్:
విద్యార్థులను భారతీయ జనతా పార్టీ భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్  మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు విద్యార్థులను పరామర్శించి వారికి కొబ్బరి బోండాలు అందించారు.
Spread the love