– తుది ఫలితాలు ప్రకటించిన టీజీపీఎస్సీ
– త్వరలో నియామకపత్రాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-4 రాతపరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది జూలై ఒకటిన గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన గ్రూప్-4 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్‌ఎల్)ను ప్రకటించామని పేర్కొన్నారు. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, వికలాంగులను 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసి జూన్ 20 నుంచి ఆగస్టు 31 వరకు, ఆ తర్వాత ఈనెల పదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టామని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత 8,084 మంది అభ్యర్థులను గ్రూప్-4 పోస్టులకు ఎంపిక చేశామని వివరించారు. వారి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం 2022, డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను ప్రభుత్వం అందజేయనుంది.