– ‘మహా’ విపక్ష కూటమి నిర్ణయం
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏకాభిప్రాయం కుది రింది. ఈ కూటమిలోని ప్రధాన పక్షాలైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్‌పీ) పార్టీలు 85 స్థానాల చొప్పున పోటీచేయాలని నిర్ణయిం చాయి. మొత్తంగా 270 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరగా.. మిగతా 18 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వెల్లడించారు. ఈ మేరకు ఆయన శివసేన (యూబీటీ) నేత సంజరు రౌత్, ఇతర నేతలతో కలిసి ముంబయిలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. 270సీట్లపై సామరస్యపూర్వకంగా ఏకా భిప్రాయానికి వచ్చినట్టు వెల్లడించారు. అయితే, సీట్ల పంపకాలపై తుది ఒప్పందానికి సంబంధిం చిన చర్చలు ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు.
దీనిపై సమాజ్‌వాదీ పార్టీతో పాటు కూటమి లోని ఇతర పార్టీలతో చర్చలు జరిపి.. గురువారం నాటికి అంతా పూర్తి చేస్తామని తెలిపారు. తామంతా మహా వికాస్ అఘాడీ కూటమిగా పోటీ చేస్తున్నామని.. ఎన్నికల్లో ‘మహాయుతి కూటమి’పై విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీట్ల సర్దుబాటులో జరుగుతోన్న జాప్యం పట్ల చిన్న పార్టీలు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, లెఫ్ట్, పీడబ్ల్యూపీలు కూటమిలో ఉన్నాయి. 12 సీట్లు ఆశిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ఐదు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.
సీఎం శిందేపై పోటీ ఎవరంటే?
మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన(యూబీటీ) అభ్యర్థుల తొలిజాబితా విడుద లైంది. మొత్తం 65మందితో జాబితాను విడుదల చేసింది. ముంబయిలోని వర్లి నుంచి మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేయ నున్నారు. సీఎం ఏక్‌నాథ్‌శిందే నియోజక వర్గమైన కోప్రి పాచ్‌పఖడి సీటులో ఆయన రాజకీయ గురువు ఆనంద్ దిఘే సోదరుడి కుమారుడైన కేదార్ దిఘేను ఉద్ధవ్ ఠాక్రే బరిలో దించారు. ప్రస్తుతం కేదార్ దిఘే ఠానే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉద్ధవ్ అనుయాయుడు, మాజీ ఎంపీ రాజన్ విచారేకు ఠానే అసెంబ్లీ సీటును కేటాయించారు. అవిభాజ్య శివసేన తరఫున 2009 నుంచి ఏక్‌నాథ్ శిందే కోప్రి పాచ్‌పఖడీ సీటు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై 89వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీఎం శిందే అక్టోబర్ 28న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.