నవతెలంగాణ-శాయంపేట : శాయంపేట మండల పరిధిలోని 24 గ్రామాలలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 86% పోలింగ్ జరిగినట్లు ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి తెలిపారు. మండలంలో 42 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 33 వేల 459 ఓటర్లకు గాను 28 వేల 547 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాదోనపల్లి పోలింగ్ స్టేషన్ 291 లో అత్యధికంగా 94 శాతం ఓటింగ్ జరగగా, కొప్పుల గ్రామంలోని పోలింగ్ స్టేషన్ 277 లో అత్యల్పంగా 75% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంగా అధికారులు గుర్తించి, ఉదయం 7:00 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపట్టగా, ఓటర్లు రాత్రి వరకు బారులు తీరడంతో అంచనాలకు మించి 86% పోలింగ్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల మూడున ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతుండడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.