– 6,7,8 విద్యార్థులకే పాఠాలు చెప్తాం
– మంత్రి సబితకు పండిత, పీఈటీ జేఏసీ అల్టిమేటం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు బోధించలేమని పండిత, పీఈటీ జేఏసీ స్పష్టం చేసింది. జాబ్ చార్ట్ ప్రకారం ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకే పాఠాలు చెప్తామని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను శనివారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సి జగదీశ్, ఎండీ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాసులు, నర్సిములు, క్రాంతికృష్ణ, గౌరీ శంకర్ కలిసి అల్టిమేటం జారీ చేశారు. పండితులు, పీఈటీల పదోన్నతులపై కోర్టులో ఉన్న అంశాన్ని త్వరగా తొలగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తమ ప్రాథమిక సభ్యుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించారు. భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వకపోతే ప్రపంచ తెలుగు మహాసభల సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కాపాడుకుంటూ తమకు పదోన్నతులివ్వాలని కోరారు. మరింత చొరవ తీసుకుని ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశిం చారని వివరించారు. ఫిబ్రవరిలో ఉన్నత తరగతులకు బోధనను ఆపుతున్నందున రూ.150 అలవెన్సును బిల్ రూపంలో చేయొద్దని సూచించారు.