– జాగో గ్రాహక్..జాగో
– పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహశీల్దార్ మాచన రఘునందన్
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునేవారు లేక పోలేదని, గ్యాస్ బుకింగ్ కోసం ఆన్ లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీసే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహశీల్దార్ మాచన రఘునందన్ వినియోగదారులను అప్రమత్తం చేశారు.గురువారం నాడు ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ..కొందరు బురిడీ కొట్టిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. వాట్సాప్, ఎస్ ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్ సైట్ లింకులను పంపిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందాయన్నారు.
ముఖ్యంగా, ఆన్ లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలని రఘునందన్ స్పష్టం చేశారు.
వినియోగదారుల హితం కోసం సూచనలు
1)ఎలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
2)సిలిండర్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి.
3) ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు.
4)నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
5)ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.inవెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.



