– ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీక
– దీనికి ప్రజలే విలేకరులు
నవతెలంగాణ తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సిబ్బందికి, యాజమాన్యానికి, ముఖ్యంగా పాఠకులకు అభినందనలు.. శుభాకాంక్షలు.. ఇలా నవతెలంగాణ మరెన్నో వసంతాలు జరుపుకోవాలి. ప్రజల సేవకు పునరంకితమవుతూ నిత్యనూతనం కావాలి. నవతెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేను చూస్తున్నాను. అది ప్రజల పత్రికగా, ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీకగా సాగుతోంది. ఇవ్వాళ మనకు తెలుసు. పత్రికలు పెద్ద వ్యాపారంగా మారిపోయాయి. పత్రికలకు రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కనబడుతున్నాయి. అనేక రకాల వ్యాపార ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు పత్రికల కంటెంట్‌ను నిర్దేశిస్తున్న సందర్భంలో మనం ఈ రోజు ఉన్నాం. ఇలాంటి సమయంలో నోరు లేని పేదల పక్షాన, కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, కష్టజీవుల పక్షాన ఏ పత్రిక ఎంత మేరకు నిలబడుతుందనేది ఒక ప్రశ్న. పెట్టుబడికి-శ్రమకు మధ్య జరిగే నిరంతర ఘర్షణలో మెయిన్ స్ట్రీమ్‌గా చెప్పబడే అత్యధిక పత్రికలు పెట్టుబడివైపే నిలబడతాయని మన అనుభవం రుజువు చేస్తున్నది. ఇటీవల మద్యం కవరేజి చూస్తే మనకర్థమవుతుంది. బడ్జెట్‌లో ప్రజలు, ముఖ్యంగా కష్టజీవుల ప్రయోజనాల గురించి ఎన్ని పత్రికల్లో ఎన్ని విశ్లేషణలు, ఎన్ని కథనాలు వచ్చాయో చూడండి. అందుకే ఎంత బలమైన మీడియా ఉన్నా ప్రజల మీడియా, ప్రత్యామ్నాయ మీడియా అవసరం ఎప్పుడూ ఉంటుంది. వీటికి వనరులు ఉండకపోవచ్చు. వేల కొలది జీతాలిచ్చి కలం నిపుణులను పెట్టుకోలేకపోవచ్చు. పెద్ద మార్కెటింగ్ నెట్‌వర్క్ ఉండకపోవచ్చు. కానీ సమాజంలో ఏ రకమైన శక్తుల ప్రలోభాలకు, ప్రభావాలకు లోను కాకుండా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేసే సామర్థ్యం మాత్రం ఉంటుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం నవతెలంగాణం. వేలాది, లక్షలాది మంది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న నవతెలంగాణ లాంటి పత్రికలకు ఆ ప్రజలే విలేకరులుగా మారుతారు. దీన్ని క్రౌడ్ సోర్సింగ్ అంటారు. ప్రజలే విలేకరులుగా మారి వార్తలు చేరవేస్తుంటారు. అందువల్ల ప్రత్యామ్నాయ పత్రికగా, ప్రత్యామ్నాయ జర్నలిజంగా, ప్రజల జర్నలిజంగా నవతెలంగాణ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను
– ప్రొఫెసర్ కె. నాగేశ్వర్