టీమిండియా క్రికెటర్‌కు తప్పిన పెను ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్
టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పాండవ్‌ నగర్‌ నుంచి మీరట్‌కు వస్తుండగా ప్రవీణ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న ల్యాండ్‌ రోవర్‌ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్‌ ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్‌తోపాటు అతని కుమారుడు కారులో ఉన్నాడు. అయితే వీరిద్దరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం ‍కారణంగా ప్రవీణ్‌ ప్రయాణిస్తున్న కారు నుజ్జుగుజ్జయ్యింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాంటర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్‌ సిటీ ఎంట్రెన్స్‌లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. ప్రవీణ్ కుమార్ మీరట్‌లోని బాగ్‌పత్ రోడ్‌లో ఉన్న ముల్తాన్ నగర్‌లో నివాసం ఉంటాడు. 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007-12 మధ్యలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ప్రవీణ్‌ ప్రధాన బౌలర్‌గా సత్తా చాటాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవీణ్.. 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 77, టీ20ల్లో 8, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా ప్రవీణ్‌ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. 119 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ అయిన ప్రవీణ్‌ అడపాదడపా బ్యాట్‌తో కూడా రాణించాడు. వన్డేల్లో అతని పేరిట ఓ అర్ధసెంచరీ ఉంది.

Spread the love