– నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు ద్వారా బాటలు వేస్తాం
– ఏపీలో ఎమ్‌ఈఆర్‌ఐటీ ఏర్ాటు అభినందనీయం : ఎన్‌ఎమ్‌ఈటీ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన దేశంలో ఖనిజాల ఎక్స్‌ప్లోరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామనీ, అందులో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేన్ ట్రస్టు(ఎన్‌ఎమ్‌ఈటీ) ఆరో గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఎక్స్‌అఫిషియో చైర్మెన్ హోదాలో ఆయన ప్రసంగించారు. దేశంలో ఖనిజ సంపదకు లోటులేదనీ, అనుకున్నంత మేరకు ఖనిజాల సామర్థ్యాన్ని గుర్తించలేక పోయామని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్‌ఎమ్‌ఈటీని స్థాపించారని తెలిపారు. దీంతో ఖనిజాల ఎక్స్‌ప్లోరేషన్‌లో ఏటేటా పురోగతి సాధిస్తున్నామన్నారు. రాష్ట్రాలు ఎన్‌ఎమ్‌ఈటీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్‌ఎమ్‌ఈటీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్‌ఈఆర్‌ఐటీని ఏర్పాటు చేయడం అభినంద నీయమన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామనీ, ప్రయివేటు రంగానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీనిచ్చారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. సహకార సమాఖ్య విధానంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తామన్నారు.
ఎన్‌ఎమ్‌ఈటీ ద్వారా చేసిన కార్యక్రమాలు, ప్రాజెక్టులను ఆయన వివరించారు. నేషనల్ జియోసైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ ద్వారా.. ఎక్స్‌ప్లొరేషన్ ద్వారా సాధించిన పురోగతిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కేంద్ర అటామిక్ ఎనర్జీ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ దుబే మాట్లాడుతూ.. దేశంలో ఖనిజాల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు రాష్ట్రలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..గనుల రంగంలో తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నదని చెప్పారు. ఆఫ్ షోర్ మైనింగ్, క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించామన్నారు.