పుస్తకం ఒక దిక్సూచి

A book is a compass– జ్ఞాన సంపదకు నిలయం బుక్‌ఫెయిర్‌
– భవిష్యత్‌లో సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌
– చరిత్ర వక్రీకరణ, ఎత్తివేత తగదు : రమా మెల్కొటే
– ఫోన్లను పక్కనబెట్టండి..పిల్లలను చదివించండి : కె.శివారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జీవన విధానాన్ని మలుచుకోవడంలోనూ, మార్గాన్ని ఎంచుకోవడంలోనూ పుస్తకం ఒక దిక్సూచిగా పనిచేస్తుందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జ్ఞానసంపదకు నిలయం బుక్‌ఫెయిర్‌ అని కొనియాడారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన సోమవారంతో ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదో తరగతి తర్వాత దశా,దిశా నిర్ణయించడంలో పుస్తకాలదే కీలక పాత్ర అన్నారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, తదితర రంగాలకు చెందిన ప్రత్యేక పుస్తకాలున్నాయని చెప్పారు. బంగారు తెలంగాణలో బుక్‌ఫెయిర్‌కు అన్ని సౌకర్యాలు కల్పించారని అనుకున్నాననీ, ఇది కూడా మేడిపండు మేడిగడ్డ లెక్కనే ఉందా? విమర్శించారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఒకదాని వెనుక మరొక కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో కనీస వసతులు కల్పిస్తామనీ, అయితే, వాటి నిర్వహణ కూడా కీలకమేనని చెప్పారు. భవిష్యత్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. పుస్తకాలు చదివేవారి గ్రాఫ్‌ రోజురోజుకీ పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని నొక్కి చెప్పారు. పిల్లలతో విధిగా పుస్తకాలు చదివించాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి మార్గదర్శనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పుస్తక ప్రదర్శన భవిష్యత్తులోనూ విజయవంతంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి మాట్లాడుతూ..పుస్తకం లేకపోతే తాను లేననీ, పుస్తకమే తనను ప్రపంచమంతా తిప్పిందని చెప్పారు. తమ అమ్మ మనుషులను చదవడం నేర్పిందనీ, మనుషులు కూడా పుస్తకాల్లాంటి వారేనని అన్నారు. తల్లి ఓ ఫోన్‌, తండ్రి ఓ ఫోన్‌ పట్టుకుని కూర్చుంటే పిల్లలు కూడా ఫోన్లకే అతుక్కుని వాటికి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైన మేరకు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ గడపాలనీ, అప్పుడే పిల్లలు సమాజంపై గౌరవాన్ని కలిగి ఉంటారని చెప్పారు. ప్రొఫెసర్‌, రచయిత్రి రమా మెల్కొటే మాట్లాడుతూ..నేడు మన దేశంలో చరిత్ర వక్రీకరణకు గురవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్ర వక్రీకరణ, ఎత్తివేతకు పాల్పడితే భవిష్యత్‌ తరాలకు గతం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. సెక్యులరిజం, లౌకితత్వం వంటి పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలనే చర్చ నడవడం బాధాకరమన్నారు. మహిళలు రాసే రచనలకు స్త్రీవాదం అనే ముద్ర వేసి పక్కనపెట్టేయడం తగదని హితవు పలికారు. సెల్‌ఫోన్లు, టీవీలను పక్కనబెట్టకపోతే ఉన్న జ్ఞానం పోతుందనీ, ఆలోచనాతత్వం పోతుందని హెచ్చరించారు. వీలైనంత మేరకు పిల్లల చేత ప్రముఖుల జీవిత చరిత్రలను చదివించాలనీ, వాటి ద్వారా ప్రశ్నించేతత్వం, ఆలోచించే తత్వం మెరుగవుతాయని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ..పుస్తక సంస్కృతిని తెలంగాణ వ్యాప్తంగా వ్యాపింపజేయడమే తమ లక్ష్యమన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ మాట్లాడుతూ..అన్ని ఐడియాలజీలున్న వ్యక్తులందర్నీ ఒక చోటకు చేరుస్తున్న ఘనత బుక్‌ఫెయిరేదనని కొనియాడారు. యూఎస్‌లోని పబ్లిక్‌ లైబ్రరీలో చాలా మంది తాము కొని చదివిన పుస్తకాలను అక్కడ ఇచ్చేసి వేరేవి తీసుకెళ్లి చదువుతారనీ, ఆ తర్వాత వాటిని తిరిగి లైబ్రరీలకే ఇచ్చేస్తారని చెప్పారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ పుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశముంటుందన్నారు.ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కోసం పోరాడుతున్న ముద్రబోయిన రచన మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్ల జీవితాలు, వారి కష్టాలపై కవితలు, నవలలు రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. వచ్చే బుక్‌ఫెయిర్‌లో ట్రాన్స్‌జెండర్ల తరఫున ఒక బుక్‌స్టాల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్‌ కుమారుడు సూర్యం, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ వ్యవస్థాపకులు రాజేశ్వర్‌రావు, కార్యదర్శి ఆర్‌.వాసు, అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్‌, ఉపాధ్యక్షులు కె. చంద్రమోహన్‌, నారాయణరెడ్డి, సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, కమిటీ సభ్యులు బాల్‌రెడ్డి, విజయరావు, జనార్థన్‌మూర్తి, యాకూబ్‌, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love