పిల్లల ఊహాశక్తిని పెంచేదే పుస్తకం

”మేం కిందట నెల ‘అజంతా అపార్ట్‌మెంట్స్‌’లో ఉన్నాం. హస్మినా, జ్యోతి, మదన్‌ వాళ్ళంతా మాకు మంచి స్నేహితులు. అల్లరి జ్యోతి అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మాకు అల్లరి ఇష్టం. మాతో పాటు మా కుటుంబంలో అందరికీ అజంతా అపార్ట్‌మెంట్స్‌ బాగా పరిచయం. ఆ అపార్ట్‌మెంట్‌ కు రంగులు కూడా వేసాం. ఇప్పుడు మేమంతా జపాన్‌ వెళ్ళాం. అక్కడ గాంబో పరిచయం అయ్యాడు. డ్రాగన్‌ సునామీ గురించి తెలుసుకుని భయం వేసింది. మొమోతారో కథను కళ్ళు ఇంత చేసుకుని విన్నాం. ‘ప్రపంచమంతా మాదే!! మా ఆశలకు ఆకాశమే హద్దు – మా ఊహలకు రెక్కలు తొడిగే కథలంటే ముద్దు’. ప్రపంచాన్ని పిల్లల ముంగిట్లోకి తెచ్చిపెట్టే పుస్తకాలున్న ఏ ఇంట్లో పిల్లల్ని కదిపినా ఇలాంటి కబుర్లే వినొచ్చు. పిల్లల పుస్తకాలు చదువుతూ మనమూ పిల్లలమవుతాం. వాళ్ళ ఊహల్లో మనమూ విహరిస్తాం. మళ్ళీ మన బాల్యంలో చదువుకున్న ‘థంబ్లీనా, రాజు గారి కొత్త బట్టలు, లిటిల్‌ మెర్‌మైడ్‌, అగ్లీ డక్లింగ్‌’ వంటి కథల జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. ఈ కథలు మన బాల్యంలో చెరగని ముద్ర వేశాయి. అలాంటి అద్భుతమైన కథలు 160కు పైగా అందించి పిల్లల పుస్తకాల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి, డానిష్‌ రచయిత ‘హాన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్సన్‌’. ఆయన పుట్టినరోజు ఏప్రిల్‌ 2వ తేదీను ప్రపంచవ్యాప్తంగా ”పిల్లల పుస్తక దినోత్సవం”గా జరుపుకుంటున్నాం.
‘ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ బుక్స్‌ ఫర్‌ యంగ్‌ పీపుల్‌’ అనే అంతర్జాతీయ సంస్థ మొదటిసారిగా 1967వ సంవత్సరంలో ఏప్రిల్‌ 2వ తేదీన అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రతీ ఏడు పండుగలా జరుపుకునే ఈ వేడుకకు ఒక దేశం నిర్వహణ బాధ్యతలు తీసుకుని జరుపుతుంది. 2024 సంవత్సరానికి ఈ పండుగకు జపాన్‌ వేదిక కానుంది. ప్రతీ ఏడు ఒక విభిన్నమైన అంశాన్ని ఎంచుకుని ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ‘ఇమేజినేషన్‌’ (ఊహశక్తి) అంశం. దీనికి ప్రత్యేకమైన పోస్టర్‌ రూపొందిస్తారు. ఇందులో భాగంగా అనేక కథల పోటీలు నిర్వహించడం, పాఠశాలల్లోనూ, గ్రంధాలయాల్లోనూ వివిధ కార్యక్రమాలతో పాటు బాలసాహిత్య రచయితలకు పురస్కారాలు ప్రధానం చేయడం వంటివి చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపడానికి కారణం ఒక్కటే! పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి, వారిని పుస్తక ప్రేమికులుగా చేయాలనే తపన.
పిల్లల పుస్తకాలకు ఎందుకీ ప్రాముఖ్యత?
తెల్ల కాగితంలా మొదలయ్యే మన జీవితానికి అందమైన రూపును ఇచ్చేది పుస్తకం. పిల్లల పురోగతిలో పుస్తకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురోగతి అంటే కేవలం చదువు అనుకోకండి. పిల్లల మానసిక పురోగతికి మెట్లు పుస్తకాలు. మాటలు రాని వయసులో బొమ్మల పుస్తకాలు ప్రపంచం పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. ఊహాశక్తిని పెంపొందిస్తాయి. ఆలోచనా పటిమను పెంచటమే కాక భాష తెలుసుకోవాలన్న కూతుహలాన్ని కలిగిస్తాయి. పుస్తకాలు పిల్లల ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. పిల్లల పుస్తకాలు ప్రధాన ఉద్దేశ్యం వినోదమే! ఆ తరువాతే విద్య, విజ్ఞానం.
మనిషిది ఏ పనిలోనైనా ఆనందాన్ని అన్వేషించే నైజం. ఆ సంతోషమే మనసుని ఉత్తేజపరిచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. దీనికి పిల్లలేమీ అతీతులు కారు. పిల్లల పుస్తకాలు వారి మనసులను మురిపించాలి, ముచ్చట్లు చెప్పాలి. ఊహల్లో ఊయలలూపాలి. వింతల్లో విహరింపజేయాలి. అప్పుడే వారి పసిమనసులు ఆనందాల హరివిల్లులవుతాయి. ఈ మానసిక సంతోషమే వారి సర్వతోముఖాభివద్ధికి మూలం. అయితే ఈ సంతోషాన్ని వేరే సాధనాలు కూడా ఇస్తాయి కదా అనే ఆలోచన రాక మానదు. మీ ఆలోచన సరైనదే! కానీ పుస్తకాలు పంచే ప్రేమను, పెంపొందించే వ్యక్తిత్వాన్ని వేరే సాధనాలు ఇవ్వలేవు. అది చూడాలంటే పుస్తకాలతో ప్రేమలో పడాల్సిందే!
నేడు పిల్లల్లో చాలా రకాల భావోద్వేగ సమస్యలను చూస్తున్నాం. కారణాలు అనేకం. కానీ లోతుగా పరిశీలిస్తే వారికి ప్రపంచం పట్ల అవగాహనా లోపమే దీనికి ప్రధాన కారణమని నేను భావిస్తాను. ఇవాళ ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసిందని మనం అనుకుంటున్నాం. కానీ అద్దం అవతల ప్రపంచం అందుకోలేమన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని తెలుసుకోలేని పసిమనసులు సంధిగ్ధతకు, సంఘర్షణకు లోనవుతున్నాయి. తోటివారి జీవితాలను తెలుసుకునే అవకాశాలు తక్కువ. భావవ్యక్తీరణకు సరైన భాష రాదు. సమస్యలను చర్చించే చొరవ లేదు. ఫలితంగా బాల్యం మూగబోతోంది. యువతరం ఒంటరితనానికి బానిసవుతోంది. ఈ సమస్యలకి పరిష్కారం పుస్తకాలేనా?? అంటే ముమ్మాటికీ అవుననే నా సమాధానం.
పసి వయసులో పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. భిన్న వ్యక్తిత్వాలను, స్వరూపాలను, సంస్కతులను, సాంప్రదాయాలను కథల్లోనూ, బొమ్మాల్లోనూ ఇముడ్చుకుని చూపిస్తుంది. కష్ణుడు, రాముడు కూడా మనకు అలా పరిచయమైనవాళ్లే. చిన్నప్పుడు కష్ణుడి అల్లరికి ఆనందిస్తే, నేడు కష్ణుడి గీతను జీవనరీతిగా అనుసరిస్తున్నాం. పైన చెప్పిన ‘అజంతా అపార్ట్మెంట్స్‌’ మనం ఒకప్పుడు చదువుకున్న ఎలినా వాట్స్‌ రచించిన కథలే. వివిధ దేశాల భౌగోళిక పరిస్థితులను, అక్కడి ప్రజా జీవనాన్ని అద్దం పట్టే జానపద కథల్లో పాత్రలు పిల్లల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. జపాన్‌ కథల్లోని మొమోతారో, గాంబో మా పిల్లలకు అలా పరిచయమైనవారే. పుస్తకంలోని పాత్రలు చూపించే స్నేహం, ప్రేమ, కోపం, బాధ, సహాయం, సాహసం, తెలివి, సమయస్ఫూర్తి అన్నిటినీ పిల్లలు తమ జీవితాల్లో అన్వయించుకుంటారు. ఇది ఎదిగే కొద్దీ వారిలో ఒక స్థిరమైన వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని ఏర్పారుచుకునేలా దోహదం చేస్తుంది.
భాష భావవ్యక్తీకరణకు మూలం. మన పిల్లలకు ఏ భాష మీద మంచి పట్టు ఉందో ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మాతభాషలో కాకపోయినా ఏదో ఒక భాషలో పట్టు ఉంటేనే కదా.. వాళ్ళ ఆలోచనలను పరిపూర్ణంగా వ్యక్తీకరించగలరు. ప్రసార మాధ్యమాల పుణ్యం వలన మన పిల్లలు ఏ భాషనైనా త్వరగానే నేర్చుకుంటున్నారు. కానీ అక్షరరూపం ఇవ్వమంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారు. దీనికి కారణం వాళ్ళకు భాషా స్వరూపం మీద సమగ్ర అవగాహన లేకపోవడమే! పదిహేనేళ్ళు వచ్చాక వాళ్ళలో లోపాలు వెతకడం, సరిదిద్దడానికి పాట్లు పడడం కన్నా చిన్నప్పటి నుండి పుస్తకాలను పరిచయం చేస్తే భాష మీద ఎనలేని పట్టు సాధిస్తారు. పెద్దయ్యాక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసులకి పంపే కన్నా పసివయసు నుండి పుస్తకాలపై ప్రేమను పెంచుకునేలా చేయడం సులభం కదా! భావవ్యక్తీకరణ అయినా, భావోద్వేగ సమతౌల్యం అయినా పుస్తకపఠనం చేసే వారిలో ఎక్కువగా ఉంటుంది.
పిల్లల పుస్తక దినోత్సవాన్ని మనమెలా జరుపుకుందాం?
మనం జరుపుకునే పండుగలన్నిటికన్నా ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని అంటాను. ఎందుకంటే రేపటి తరాన్ని తయారుచేసే పుస్తకాల ప్రాధాన్యత మన పిల్లలకు తెలియజేయటం మన బాధ్యత. రంగు రంగుల బొమ్మల పుస్తకాల నుండి స్ఫూర్తిని కలిగించే గాథల వరకు అన్నిటినీ మన పిల్లలకు పరిచయం చేద్దాం. వాళ్ళతో కలిసి కూర్చుని చదివి పుస్తక పఠనంలోని ఆనందాన్ని రుచి చూపిద్దాం. పిల్లలకు నచ్చిన పుస్తకాలను బహుమతిగా ఇద్దాం. ఈ సంవత్సరపు థీమ్‌ అయిన పిల్లల ‘ఊహశక్తి’కి ఊతం ఇద్దాం. ఆండర్సన్‌ కషికి గౌరవం ఇద్దాం. మరింత ముందుకు తీసుకెళ్దాం. నెలకు ఒక్క పుస్తకం చొప్పున వచ్చే సంవత్సరంలోపు మన పిల్లలను పన్నెండు పుస్తకాలతో స్నేహం చేయిద్దాం.
– డా. హారిక చెరుకుపల్లి, 9000559913

Spread the love