తెల్లవారితే పుట్టినరోజు.. గుండెపోటుతో బాలుడి మృతి

నవతెలంగాణ – ఆదిలాబాద్
ఆ కుర్రాడికి నిండా ఇరవయ్యేళ్లు లేవు.. తెల్లవారితే అతడి పుట్టినరోజు.. వేడుకలకు అంతా సిద్ధమవుతుండగా.. హఠాన్మరణం చెందడంతో ఆ ఇంట విషాదం నిండింది. కుటుంబసభ్యులు, స్నేహితులు బాధాతప్త హృదయాలతో మృతదేహం చేయి పట్టుకొని పుట్టినరోజు కేకు కోయించి భోరున విలపించారు. ఈ విషాద ఘటన కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గుణవంత్‌రావు- లలితల మూడో కుమారుడు సచిన్‌ (16). శుక్రవారం అతడి పుట్టినరోజు కావడంతో స్నేహితులతో వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఒక్కసారిగా కడుపులో మంటతో ఇబ్బందిపడడంతో తొలుత ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సిఫారసు మేరకు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలుడు అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో సాయంత్రం మృతిచెందాడు. తెల్లవారితే జన్మదినోత్సవం జరుపుకోవాల్సిన అతడి హఠాన్మరణాన్ని మిత్రులు, కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. అదేరోజు అర్ధరాత్రి వారు మృతదేహం చేతితో పుట్టినరోజు కేకు కోయించారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.

Spread the love