తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తి మెడపై పొడిచి చంపిన బాలుడు

నవతెలంగాణ – ముంబై: ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరానీవాడికి చెందిన అబ్దుల్‌ రహీమ్‌ మాలిక్‌ (43).. స్థానికంగా ఉండే ఓ 17 ఏళ్ల బాలుడి తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆమె అబ్దుల్‌ రహీమ్‌పై లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. పోలీసులు హెచ్చరించి పంపించిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన అబ్దుల్‌ రహీమ్‌ ఆ మహిళపై మరోసారి బూతు పదజాలంతో విరుచుకుపడ్డాడు. నోటికొచ్చింది మాట్లాడుతుంటే సదరు మహిళ కొడుకు కూడా అబ్దుల్‌ రహీమ్‌తో వాదనకు దిగాడు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో బాలుడు ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న స్క్రూడ్రైవర్‌ తీసుకొచ్చి అబ్దుల్‌ రహీమ్‌ మెడపైన, తలపైన పొడిచాడు. దాంతో అబ్దుల్ రహీమ్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. రహీమ్‌ భార్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడిని అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోమ్‌కు తరలించారు.

Spread the love