ఈ మాలపల్లి చిత్రానికి కథను సమకూర్చింది మరో గొప్ప రచయిత గుడిపాటి వెంకటాచలం. శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందుమాట రాసినవాడు. మైదానం దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ వంటి ఎన్నో రచనలు చేసిన ఆయన, ఎన్నో వ్యంగ్య నాటికలు కూడా రాశాడు. ‘హరిశ్చంద్ర’ నాటికలో ఒక సీను ఉంటుంది – అందులో… భార్యను వేలం వేసి అమ్ముతున్న హరిశ్చంద్రునికి పిచ్చి పట్టిందని, ప్రజలంతా గుమిగూడి అతణ్ణి కట్టేసి తంతారు! ఈ ఒక్క దృశ్యంతో చలం ఆలోచనా ధోరణి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తెలుగులో న్యూ సినిమా మూవ్‌మెంట్ ఇటీవలి కాలంలో మొదలైందని కొందరు అపోహపడొచ్చు. కానీ, అది నిజం కాదు. తెలుగు చిత్రాలు ప్రారంభమైన తొలిదశలోనే గూడవల్లి రామబ్రహ్మం ఆ పనికి శ్రీకారం చుట్టాడు. ‘భక్తప్రహ్లాద’ వంటి పౌరాణికాలు ఒకవైపు నిర్మాణమవుతూ ఉంటే, జాతిని చైతన్యపరచడానికి మరోవైపు రామబ్రహ్మం కంకణం కట్టుకున్నాడు. అంటరానితనం అడుగంటాలని, కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెళ్ళగించి వేయాలని ఒక మహౌన్నతమైన సంస్కరణ వాదంతో రూపొందించిన చిత్రం ‘మాలపిల్ల!’ బ్రాహ్మణా ధిక్యత గల అలనాటి సమాజంలో మాలల దుస్థితి ఎలుగెత్తి చెప్పడమే కాకుండా, ఇతర కులాలవారు వారిని పెళ్ళాడి వారిని మనుషులుగా గుర్తించాలని కూడా ఆ చిత్రం సూచించింది. పైగా, మనుషులంతా ఒక్కటేనన్న సందేశాన్నిచ్చింది.
తెలుగులో వెలువడ్డ మొదటి సాంఘిక చిత్రం – ‘ప్రేమ విజయం’ అది 1936లో వెలువడింది. కాని, విజయవంతం కాలేదు. రెండు సంవత్సరాల తర్వాత 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సామాజిక సంస్కరణకు ఉద్దేశించి వెలువడింది. ఆ చిత్రం తెలుగువారినే కాకుండా తమిళులను కూడా విశేషంగా ఆకర్షించింది. అవి భారత స్వాతంత్య్రం కోసం అహింసా పద్ధతిలో పోరాటాలు సాగుతున్న రోజులు. సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం నిత్యజీవితంలో భాగమైన రోజులు. ఆ రోజుల్ని, ఆనాటి సమకాలీన సాంఘిక పరిస్థితుల్ని యథాతథంగా చిత్తశుద్ధితో విప్లవ స్ఫూర్తితో ఆ చలనచిత్రాన్ని చిత్రీకరించాడు – గుడవల్లి రామబ్రహ్మం. ”లేరా లేరా నిద్దుర మానర హరిజన వీర కుమారా / మానవులే నిను మాల మాలయని దూరము చేసిరి కదా?” అనే పాటతో చిత్రం ప్రారంభమవుతుంది. కళ్యాణపురం అనే కుగ్రామంలో గాంధీజీ అభిమానులు సమావేశం ఏర్పాటు చేస్తారు. జనం తండోపతండాలుగా దానికి వెళుతుంటారు. అందులో హరిజనుడొకడు గొడుగు వేసుకుని వెళ్ళడం బ్రాహ్మణ పెద్దలకు నచ్చదు. పిలిచి, దుర్భాషలాడి చెప్పుతో కొడతారు. హరిజనుల్లో చలనం కలుగుతుంది. గాంధీజీ బోధనలతో ప్రభావితులై, బ్రాహ్మణాధిక్యతను సహించలేక – ఆలయ ప్రవేశాన్ని కోరుతున్న హరిజనుల్లో అసహనం పెల్లుబుకుతుంది. ”పావనమౌనీ గుడిలో పాదము పెట్టగలనిమ్ము హరా / మహదేవ్, జై మహదేవ్, జై మహదేవ్” – అని ప్రార్థిస్తారు. తలుపులు తోసుకుని ఆలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు.
సనాతనవాది ఆలయ ధర్మకర్త మేడిచర్ల సుందరరామశాస్త్రికి విషయం తెలుస్తుంది. ”మాలలు దేవాలయం అపవిత్రం చేస్తుంటే ఊరుకోవడమేనా ఛీ-బ్రాహ్మణులమై పుట్టి ఏం ప్రయోజనం?” – అని తన వాళ్ళను దూషిస్తాడు. ”మీలో బ్రాహ్మణ రక్తం లేదూ?” అని ప్రశ్నిస్తాడు. సత్య దృష్టితో, దౌర్జన్యరహితంగా బ్రాహ్మణుల కళ్ళు తెరిపించాలని గాంధేయవాది చౌదరి హరిజనులకు సర్ది చెపుతుంటాడు. సమాధాన పరుస్తుంటాడు. కానీ, మరొక వైపు బ్రాహ్మణులు తమను తాము పొగడుకుంటూ ఉంటారు. ”పికిలి పిట్ట పేడ పురుగు ఒకటే అవుతుందా? సింహం, చీమ ఒకటే అవుతాయా? – అని ప్రశ్నిస్తుంటారు. తమను తాము ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటారు. అంతే కాదు, పంచములు ఆదివాసులయ్యారనీ, వారే నేడు హరిజనులయ్యారని రేపు ఇంకా ఏం కాబోతారోనని రామశాస్త్రి హేళన చేస్తాడు. కిన్నెరలు, కింపురుషులు, బ్రహ్మరుషులు అవుతారేమోనని గేలి చేస్తాడు. అవసరమైతే బ్రాహ్మణులూ క్షాత్రం పూనగలరని హెచ్చరిస్తాడు. యుగయుగాలుగా తమదై ఉన్న ఈ తాత్త్విక సంపదను పరులకు ఎంత మాత్రమూ అంటగట్టబోమని స్పష్టం చేస్తాడు. అంతే కాదు, చెరువు నీళ్ళు హరిజనుల గూడేనికి పోకుండా కట్టుదిట్టం చేస్తాడు.
జీవుల గురించి, జీవుల ప్రత్యేకతల గూర్చి మొత్తానికి మొత్తంగా జీవ పరిణామం గురించి ప్రాథమిక అవగాహన లేనివారే సింహం, చీమ ఒకటి అవుతాయా? అని ప్రశ్నిస్తారు. కిన్నెరలు, కింపురుషులు వంటివారు నిజంగా ఉండరని అవన్నీ మనువాదుల కల్పనలని తెలుసుకోని వారు అజ్ఞానంగానే ప్రశ్నలు కురిపిస్తారు. ఏమైనా తోటి మనుషులకు నీళ్ళు అందకుండా చేయడం వంతటి మూర్ఖత్వం? అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో అలా జరిగింది గానీ, ఈ ఆధునిక యుగంలోనైతే అది శిక్ష విధించాల్సిన నేరం! ఇక్కడ గాంధీజీ గురించి, గాంధేయవాదుల గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఆ రోజుల్లో వారి తొలి ప్రాధాన్యత భారత స్వాతంత్య్ర పోరాటం. సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని వర్ణాల వారిని, అన్ని స్థాయిల వారిని సంఘటిత పరిచి, భిన్నమైన విధానాలు గలవారిని కలుపుకుంటూ, వారిని స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు చేయడమే ముఖ్యం – అని అనుకున్నారు. ఎవరి మత విశ్వాసాలు వారు ఉంచుకుంటూ స్వాతంత్య్ర సమరంలోకి కదిలి రావాలని గాంధీజీ పిలుపునిచ్చారు. అందుకే గాంధీయవాదులు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎండగట్టలేక పోయారు. నిమ్న జాతుల వారి స్థాయి పెంచడానికి ”దళితులు” అని సంభోదించారు. తప్పిస్తే, దానితో వారి బతుకుల్లో వెలుగులు నిండలేదు. గాంధీజీలో ఒక మనువాది ఉన్నాడు కాబట్టే, పలు సందర్భాల్లో బాహాటంగా బయటపడి దళితుల పక్షాన నిలబడలేక పోయాడు. ఇక సమాజంలో కొందరికి ఆలయ ప్రవేశమున్నప్పుడు తమకు కూడా ఆ అర్హత ఉండాలి కదా? అని దళితులు ఆలయ ప్రవేశం కోరుకున్నారు. ఇటీవలి కాలంలో శబరిమలైలోకి మహిళలు ప్రవేశించాలనుకున్నది కూడా అందుకే! మానవహక్కులు అందరికీ సమానంగా ఉండాలని చేసిన పోరాటాలు అవి! అంతే కానీ, దేవుడి మీద భక్తితో చేసిన పోరాటాలు కాదు – వైదికులు మానవ హక్కులకు విఘాతం కలిగించిన అనేక సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. కరడు గట్టిన అగ్రవర్ణాల పెత్తనం, కొనసాగుతున్న సమయంలో గూడవల్లి రామబ్రహ్మం ఈ ‘మాలపిల్ల’ చలన చిత్రం తీయడమన్నది గొప్ప సంచలనం! అది కూడా తెలుగు చలన చిత్ర నిర్మాణ ప్రారంభదశలోనే తీయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయిన దర్శక నిర్మాతలు, రచయితలు, కవులు సమాజాన్ని వెనక్కి నడిపించే చలన చిత్రాలు ఇప్పటికీ తీస్తున్నారు. మానవ హక్కుల్ని దెబ్బతీసే హింస, దౌర్జన్యాలు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. వీరంతా – 85ఏండ్ల క్రితమే మాలపిల్లను ఎంతో ధైర్యంగా చిత్రీకరించి ఘనవిజయం సాధించిన గూడవల్లి రామబ్రహ్మం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది! కనీసం తామెంత వెనకబడి ఉన్నామన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి.
సరే – మళ్ళీ నాటి ‘మాలపల్లి’ చలన చిత్రానికి సంబంధించిన విషయంలోకి వద్దాం! గాంధీ గారి మనుషులు ఒకవైపు హరిజనులకు నీరు సరఫరా చేస్తూ, మరోవైపు బ్రాహ్మణ వర్గానికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. గాంధేయవాది అయిన చౌదరి హరిజనులను రెచ్చగొడుతున్నాడని అపార్థం చేసుకుంటారు – బ్రాహ్మణులు! అద్దెకు ఉంటున్న ఆయన్ని ఇల్లు ఖాళీ చేయించి, వీధిన పడేస్తారు. ఆయన ధైర్యం కోల్పోకుండా ‘మాలలు మాత్రం మనుషులు కారా?’ అనుకుని వెళ్ళి మాలగూడెంలో బస చేస్తాడు. అంతే కాదు, వారిని సంఘటిత పరుస్తాడు. బ్రాహ్మణవర్గం దిగి వచ్చేదాకా సమ్మెకట్టి – సహాయ నిరాకరణోద్యమం కొనసాగించాలని ఉద్భోదిస్తాడు. కార్యకర్తలంతా కలిసి ‘కూలీలందరూ ఏకం కావాలిరా’ అని సమ్మె పాట పాడుతారు.
ఆలయ ధర్మకర్త సుందర రామశాస్త్రి కొడుకు ఉన్నత విద్యా భ్యాసం చేసి వస్తాడు. గాంధీయిజం వంటబట్టించుకుంటాడు. అందుకు సంబంధించిన సమావేశాలకు వెళుతుంటాడు. అభ్యుదయ వాదిగా మారతాడు. సాయంత్రాలు ఆ ఊళ్ళో ఉన్న కొండపైకి వెళుతుంటాడు. అలా ఒక రోజు కొండ మీద తిరుగుతుండగా అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ప్రేమలో పడతాడు. ఆమె పేరు చంపాలత అనీ, ఆమె ఒక మాలపిల్ల అని తెలుసుకుంటాడు. తన చాదస్తపు తండ్రి లాగా అసహ్యించుకోకుండా హృదయ పూర్వకంగా అంగీకరిస్తాడు. ఆమెతో దేశాంతరం పారిపోయి పెళ్ళి చేసుకుని, మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. పనికిరాని సంప్రదాయాలను దరిచేరనీయకుండా ఆధునికంగా జీవిస్తుంటాడు. తన కొడుకు ఆ విధంగా చేయగలడనీ సుందర రామశాస్త్రి ఏ మాత్రం ఊహించడు. ఆయనా, ఆయన భార్యా కృంగిపోతారు. దేశంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న మార్పులు వారు జీర్ణించుకోలేరు. కానీ, క్రమ క్రమంగా వారిలో కూడా మార్పు వస్తుంది. చిత్రాంతంలో హరిజనులు కూడా మనుషులేనని సుందర రామశాస్త్రి గుర్తించి వారి ఆలయ ప్రవేశానికి ముహూర్తం నిశ్చయిస్తాడు. ఆ వార్త ఆనాటి తెలుగు ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’లో చదివిన కొడుకు నాగరాజు, కోడలు చంపాలత – ఆ ముహూర్తానికి కలకత్తా నుండి తిరిగివస్తారు.
ఛాందస భావాలు గల సుందర రామశాస్త్రిగా డాక్టర్ గోవింద రాజుల సుబ్బారావు, కొడుకు నాగరాజుగా గాలి వెంకటేశ్వరరావు, మాలపిల్ల చంపాలతగా ఆనాటి అందాల తార కాంచనమాల నటించారు. బసవరాజు అప్పారావు గేయాల హక్కులన్నీ కొనేసి, గూడవల్లి రామబ్రహ్మం ఈ చిత్రంలో వాడుకున్నారు. ”కొల్లాయి గట్టితే నేమి మా గాంధీ మూలడై తిరిగితేనేమి?” ”నల్లవాడే గొల్ల పిల్లవాడే” వంటివే కాక, ఇంకా మిగతా పాటలన్నీ తాతాజీ – అంటే తాపీ ధర్మారావు రాసినవి. అంతే కాదు, చిత్రానికి సంభాషణలు సమకూర్చింది కూడా ఆయనే! తాపీవారి పేరు వినగానే చాలా మందికి ‘దేవాలయం మీద బూతుబొమ్మలెందుకు?’ ‘ఇనుప కచ్చడాలు’ ‘పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు’ వంటి ఆయన పుస్తకాలు గుర్తుకు వస్తాయి. ఆ పుస్తకాల పేర్లు తెలియని ఈ కాలపు యువతీ యువకులు ఎవరైనా ఉంటే, సంపాదించి చదవడం మేలు. ఇకపోతే ఈ మాలపల్లి చిత్రానికి కథను సమకూర్చింది మరో గొప్ప రచయిత గుడిపాటి వెంకటాచలం. శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందుమాట రాసినవాడు. మైదానం దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ వంటి ఎన్నో రచనలు చేసిన ఆయన, ఎన్నో వ్యంగ్య నాటికలు కూడా రాశాడు. ‘హరిశ్చంద్ర’ నాటికలో ఒక సీను ఉంటుంది – అందులో… భార్యను వేలం వేసి అమ్ముతున్న హరిశ్చంద్రునికి పిచ్చి పట్టిందని, ప్రజలంతా గుమిగూడి అతణ్ణి కట్టేసి తంతారు! ఈ ఒక్క దృశ్యంతో చలం ఆలోచనా ధోరణి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
చల్లపల్లి మహారాజా, గూడవల్లి రామబ్రహ్మం, యార్లగడ్డ శివరామ ప్రసాద్‌లు నిర్మాతలుగా కాగా, భీమవరపు నరసింహారావు సంగీతం సమకూర్చారు. ఆనాటి పాత పాటలు చూడాలన్న అభిరుచి ఉన్నవారు యూట్యూబ్‌లో చూడొచ్చు. నాటి సామాజిక పరిస్థితులు, వాతావరణం కనిపిస్తాయి. సంకల్పం-బలంగా ఉంటే, ఎవరైనా ఎంతటి పనైనా చెయ్యొచ్చు. అందుకు గూడవల్లి రామబ్రహ్మమే గొప్ప ఉదాహరణ! ఆయన ఆనాటి ప్రసిద్ధ పత్రికా రచయిత మాత్రమే. జమీందారో లేక ఫిల్మ్ ప్రొడక్షన్‌లో పెద్ద అనుభవమున్న వాడోకాదు. అయినా, ఆనాటి సమాజాన్ని తన శక్తిమేరకు సంస్కరించాలని ‘మాలపిల్ల’ ‘రైతుబిడ్డ’ వంటి ప్రయోజనకరమైన చలన చిత్రాల్ని రూపొందించాడు. ఆ ప్రయత్నం తక్కువదా?
– డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య
అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.