– మార్గదర్శకాల రూపకల్పనలో అధికారులు
– త్వరలో సీఎంకు నివేదిక
– ఆమోదం లభిస్తే అమలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీఆర్‌ఎస్ సర్కారు చేసిన తప్పులను మళ్లీ తామూ చేయకూడదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. విధానాల రూపకల్పనలో తప్పులు, పొరపాట్లు లేకుండా ముందుకుపోవాలని నిర్ణయించినట్టు సమాచారం. నీళ్ళు, నిధుల విషయంలో అవే వ్యూహాలను అనుసరిస్తున్న రేవంత్ సర్కారు తాజాగా ఇండ్ల విషయంలోనూ అదే బాటలో వెళ్లాలని అనుకుంటున్నది. అందుకే, ప్రతి అడుగూ ఆచితూచి వేయాలనే యోచనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు సొంత గూడు కోసం చేపట్టిన గహలక్ష్మి పథకానికి కొత్త నిబంధనలు రూపొందించడం ద్వారా ఊపిరి పోయాలని భావిస్తున్నది. పథకాన్ని అమలు చేసేందుకు కలెక్టర్లకే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. లబ్థిదారుల ఎంపికను కలెక్టర్ల స్వేచ్ఛకే వదిలేసి, తప్పొప్పులకు వాళ్లనే బాధ్యులను చేసేదిశగా కొత్త విధాన రూపకల్పనకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ పనిలో పడింది. ఈమేరకు ప్రత్యేకంగా ఒక నూతన విధానాన్ని తయారుచేసి సీఎం రేవంత్‌తోపాటు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పంపనున్నారు.
ప్రాంతాల జనాభా ఆధారంగా గహలక్ష్మి లబ్దిదారుల ఎంపికను కలెక్టర్లు చేసేలా నిబంధనలు రూపొందించేందుకు కసరత్తు చేపట్టినట్టు తెలిసింది. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ గహ నిర్మాణ పథకంలోనైనా ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం కోటా కల్పించడం సహజమని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే, ఈ పథకంలో మాత్రం కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. జనాభా ప్రాతిపదికన లబ్దిదారులను ఎంపిక చేయాలనే నిబంధనలు అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 శాతానికి పైగా గిరిజనులే నివసిస్తారు. అందుచేత, అక్కడ 1/70 చట్టం అమలులో ఉంటుంది. గిరిజనేతరుల చేతుల్లో భూమి ఉండేందుకు ఆస్కారం ఉండదు. ఒక వేళ ఉన్నా… 1960కి పూర్వం ఉన్న వారికే సొంత స్థలం కలిగి ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడ గిరిజనేతురులకు వారి జనాభా ఆధారంగా ఇండ్లు ఇవ్వడం కుదరదు. అలాగే హైదరాబాద్‌లోని పాతబస్తీతో ఇతర ప్రాంతాల్లో అధికంగా ముస్లీంమైనార్టీలు ఉంటారు. ఇక్కడ ముస్లీమేతర పేదలు సొంత స్థలం కల్గి ఉండేందుకు సాధారణంగా అవకాశం ఉండదు. రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో దళితులు సొంత స్థలం కల్గి ఉండే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా పరిస్థితులను స్థానిక కలెక్టర్లు సముతుల్యం చేసి లబ్దిదారులను ఎంపికచేసేలా నిబంధనలు రూపొందించాలని అనుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే ఇండ్లలో జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఎక్కడ ఎంత ఇచ్చామో… ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కలెక్టర్లు, లబ్దిదారులను ఎంపిక చేసిన అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంటుందని గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.
ఈ ‘గహలక్ష్మి’ పథకానికి అర్హత సాధించాలంటే వారికి ఎంత స్థలం ఇవ్వాలనే విషయంపై అధికారులు స్పష్టతకు రానట్టు తెలిసింది. గ్రామాల్లో ఎంత స్థలముంటే ఎంపిక చేయాలి ? పట్టణాల్లో ఎంత జాగా కావాలన్న దానిపై ఇతమిద్ధంగా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం.
డబుల్ బెడ్ రూం ఇండ్లను 125 గజాల్లో నిర్మించామనీ, దీనికి ఎంత భూమి అవసరమన్న దానిపై ముఖ్యమంత్రి, గహ నిర్మాణ శాఖ మంత్రి, మున్సిపల్, గ్రామీణాభివద్థి శాఖ ముఖ్య కార్యదర్శులు నిర్థారిస్తారని తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు కనీసం 125 గజాల స్థలం ఉండే అవకాశం ఉంటుందా ? అనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. చివరకు ప్రభుత్వ విధాన నిర్ణయమే కీలకం కానుంది. ఈ విధానానికి సీఎం, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే, ఆనక అమలు వేగంగా జరుగుతుందని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు.