రౌడీ షీటర్ చేతుల మరో రౌడీషీటర్ దారుణ హత్య…

– ఇద్దరూ వరుసకు సోదరులే…
– భూతగాదాలే కారణం…
– ఇద్దరు నేరచరిత్ర వారే…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
భూ తగాదాల్లో రౌడీ షీటర్ చేతిలో మరో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు వరుసకు ఇద్దరు అన్నదమ్ములే అయినా భూతగాదాలే ఒకరి ప్రాణం తీసాయి.
ఆ ఇద్దరు వరుసకు అన్నదమ్ములు ఏది చేసినా ఇద్దరు కలిసే చేసేవారు దొంగతనాలు కూడా గతంలో చేసిన పలు కేసుల్లో ఇద్దరు నిందితులే. అంతేకాదు ఆ ఇద్దరు కూడా రౌడీషీటర్లే. కానీ భూమి విషయానికి వస్తే మాత్రం ఎవరిని ఎవరు విడిచిపెట్టే ప్రసక్తి లేదు అనే విధంగా అన్న తమ్ముడిని దారుణంగా హత్య చేసిన ఘటన తంగళ్ళపల్లి మండలంలో గురువారం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని నరసింహుల పల్లె గ్రామానికి చెందిన ద్యాగ దేవయ్య, కనకయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. దేవయ్యకు తిరుపతి, కనకయ్యకు రాకేష్  కొడుకులు ఉన్నారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూ పలు దొంగతనాలకు రాకేష్, తిరుపతి లు పాల్పడేవారని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా వీరిపై పలు కేసులు నమోదు అవ్వడమే కాకుండా వీరిద్దరూ పలు కేసుల్లో జైలుకు వెళ్లినట్లు కూడా ఇటు పోలీసులు అటు గ్రామస్తులు వివరించారు. అంతేకాదు వీరిద్దరిపై రౌడీషీటర్లు కూడా ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి ఏదైనా కేసు విషయంలో జైలుకు వెళితే అన్నను జైలు నుండి విడిపించుకునేందుకు బెయిల్ కోసం రాకేష్ ప్రయత్నాలు చేసి జైలు నుండి బెయిల్ పై విడుదల చేయించేవాడని తెలిపారు. గత మూడు నెలల క్రితం రాకేష్ తిరుపతికి తెలియకుండా ఇల్లు అమ్మడంతో నాకు తెలియకుండా ఇల్లు ఎలా అమ్ముతావని గొడవకు దిగడంతో రాకేష్ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గత కొంతకాలంగా రాకేష్ తిరుపతి ల మధ్య ఉన్న వ్యవసాయ భూమి తగాదాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. గురువారం రోజు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు రాకేష్ తన తల్లితో పొలం వద్దకు వెళ్లి నీరు పెట్టేందుకు వేరే ఇతరుల పొలం వద్ద ఉన్న బావి నుండి పైప్ లైన్ ను తిరుపతి కౌలుకు తీసుకున్న పొలం మీదుగా రాకేష్ పొలంలోకి పైపులైను వేశారు. నా పొలం మీద నుండి పైప్లైన్ ఎందుకు వేశావని పైపులైన్ ధ్వంసం చేయడంతో  అన్నదమ్ములు ఇద్దరు గొడవలు దిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాత గొడవలను, కక్షలను మనసులో పెట్టుకొని తిరుపతి ఒక్కసారిగా అక్కడే ఉన్న గొడ్డలితో రాకేష్ (25) తలపై మోదాడని తల్లి తెలిపింది. నీతో రాకేష్ తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే కుప్పకూలినట్లు తెలిపారు. వెంటనే స్థానికుల సహకారంతో రాకేష్ ను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి సిఐ సదన్ కుమార్ చేరుకొని కుటుంబ సభ్యులను స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై విచారణ చేపట్టారు. గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికట్టింగ్ నిర్వహించారు. తిరుపతి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Spread the love