వాస్తవాలను ప్రతిబింబించే బడ్జెట్‌

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం, చిట్టెం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తమ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ వాస్తవాలను ప్రతిబించేలా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు విలేకర్లతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం బడ్జెల్‌లో అబద్దాలను చెప్పకుండా ప్రజలను ఒప్పించి, మెప్పించి నిజాలు మాత్రమే పొందు పర్చిందని తెలిపారు. దుబారా లేకుండా పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. గత సర్కార్‌ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయగా, తాము మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. ప్రతి నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు రూ.7,740 కోట్లను ప్రతిపాదించినట్టు వెల్లడించారు. కాంగ్రెస్‌ హయాంలో తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి, భీమా, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టులను పక్కన పెట్టి కమిషన్ల కోసం కాళే శ్వరం లాంటి మోసపూరిత ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ నిర్మించిందని వివరించారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించేందుకు ఉద్దేశించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేస్తామని చెప్పారు. గత సర్కార్‌ మాదిరిగా కాకుండా నిజాల బడ్జెట్‌ను ప్రతిపాదించన సీఎం రేవంత్‌రెడ్డికి ఈసందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love