– కెఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు
– ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
2023 వన్డే వరల్డ్‌కప్ ముంగిట టీమ్ ఇండియా చివరి ద్వైపాక్షిక సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఊహించని నిర్ణయాలు తీసుకుంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టుకు పూర్తి స్థాయి ప్రపంచ కప్ వేట సన్నద్ధతకు కంగారూలతో సిరీస్ వేదిక కానుందని భావించినా.. అందుకు భిన్నంగా బెంచ్, ఫామ్‌లోని ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఈ నెల 22 నుంచి ఆరంభం కానుంది.
నవతెలంగాణ-ముంబయి
అస్త్ర పరీక్షకు ఇదే ఆఖరుమారు!
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సమీపిస్తున్న వేళ టైటిల్ రేసులో నిలిచిన ఇతర జట్లు రేసు గుర్రాలతో గెలుపు సమీకరణాలను సరి చూసుకుంటుండగా.. మరోవైపు మాజీ చాంపియన్ టీమ్ ఇండియా ఇంకా రేసు గుర్రాలను ఎంపిక చేసుకునే పనిలోనే నిమగమైంది!. ప్రపంచకప్ జట్టునే ఆసియా కప్‌కు పంపించి.. సమర సన్నద్ధతకు శంఖం పూరించింది సెలక్షన్ కమిటీ. కానీ ప్రపంచకప్ ముంగిట భారత జట్టు ఆడబోయే చివరి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌కు కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. వరల్డ్‌కప్ ముంగిట అగ్ర జట్టు, టైటిల్ ఫేవరేట్లలో ఒకటి ఆస్ట్రేలియా. దీంతో సహజంగానే ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్‌సేన పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుందని ఆశించగా.. సెలక్షన్ కమిటీ అభిమానులకు ఝలక్ ఇచ్చింది.
ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్.. శ్రీలంకలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకబట్టింది. అయినా, కొన్ని కీలక ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. పరుగుల వేటలో జోరందుకునే క్రమంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు విశ్రాంతి కల్పించటం తెలివైన నిర్ణయంగా అనిపించటం లేదు. నెమ్మదిగా స్పందించే పిచ్‌లపై పరుగుల వేట టీమ్ ఇండియాకు ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలింది. ఆసియా కప్ ఉత్సాహంలో ఉన్న ప్రపంచకప్ జట్టును ఆస్ట్రేలియాపై ప్రయోగించకుండా.. మళ్లీ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 2022 జనవరి నుంచి వన్డేల్లో కనిపించిన అశ్విన్.. ఇప్పుడు ప్రపంచకప్ ముందు ఎందుకు జట్టు ప్రణాళికల్లోకి వచ్చాడు అనేది తర్కానికి అందటం లేదు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపికలోనూ ఇటువంటి చారిత్రక తప్పిదాలతో టీమ్ ఇండియా భారీ మూల్యం చెల్లించింది. 2023 వరల్డ్‌కప్ వేట ముంగిట అస్త్ర పరీక్షకు టీమ్ ఇండియాకు ఇదే ఆఖరు అవకాశం. కనీసం చివరి వన్డేలోనైనా ప్రపంచకప్ జట్టుతో బరిలోకి దిగి అసలు సమరానికి సై అంటుందేమో చూడాలి.
అశ్విన్ మా ప్రణాళికల్లో ఉన్నాడు. అతడి విషయంలో మ్యాచ్ ప్రాక్టీస్ పెద్ద విషయం కాదు. ఆసీస్‌తో సిరీస్‌లో అశ్విన్‌పై ఓ అవగాహన వస్తాం. ప్రపంచకప్‌లో అశ్విన్ విశేష అనుభవం జట్టుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ కంటే మెంటల్ ఫిట్‌నెస్ అత్యంత కీలకం’
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్
ఆసియా కప్‌లో
విలువైన క్రికెట్ ఆడారు. లేదంటే, ఈ సిరీస్ మరో కోణంలో ఉండేది. ప్రపంచకప్ ముంగిట కీలక ఆటగాళ్లకు ఫిజికల్ కంటే మెంటల్‌గా విరామం ఇవ్వాలని అనుకున్నాం. మూడో వన్డేకు అందరూ అందుబాటులో ఉంటారు. ఆసీస్ సిరీస్‌లో జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంది’
– అజిత్ అగర్కార్, చీఫ్ సెలక్టర్
స్వదేశంలో 2023 వన్డే వరల్డ్‌కప్ ముంగిట ఆఖరు క్షణాల్లో సైతం సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలకు తెరదించలేదు. ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆడాల్సి ఉంది. అక్టోబర్ 5న ఆరంభం కానున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ముందు.. భారత్ ఆడబోయే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. దీంతో సహజంగానే ఈ సిరీస్‌లో ప్రపంచకప్ తమ ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రయోగ వేదికగా చేసుకుంటుందనే అంచనాలు కనిపించాయి. ప్రయోగాలకే పెద్ద పీట వేసిన అజిత్ అగర్కార్ సారథ్యంలోని బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ.. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు రెండు జట్లను ఎంపిక చేసింది. తొలి రెండు వన్డేలకు బెంచ్ ఆటగాళ్లు, ఫామ్‌లో లేని క్రికెటర్లు ఎంపిక కాగా.. చివరి వన్డేకు మాత్రం వరల్డ్‌కప్ జట్టు బరిలోకి దిగుతుంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సెప్టెంబర్ 22న తొలి వన్డేడో షురూ అవుతుంది.
అశ్విన్ వచ్చాడు
సీనియర్ ఆఫ్ స్పిన్నర్, 37 ఏండ్ల రవిచంద్రన్ అశ్విన్‌కు ఎట్టకేలకు వన్డే జట్టుకు పిలుపు అందింది. చివరగా 2022 జనవరిలో వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్.. ఏకంగా ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌కప్ జట్టులో జడేజా, అక్షర్ పటేల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు. కుల్దీప్ యాదవ్ మణికట్టు మాయగాడు. సంప్రదాయ, నాణ్యమైన ఆఫ్ స్పిన్నర్ భారత జట్టులో కరువయ్యాడు. దీంతో అశ్విన్ సహా వాషింగ్టన్ సుందర్‌ను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేశారు. అక్షర్ పటేల్ తొడ కండరాల గాయం బారిన పడగా ఆసియా కప్ ఫైనల్లోనూ ఆడిన వాషింగ్టన్ సుందర్.. వరల్డ్‌కప్ బ్యాకప్ బృందంలో చోటు సాధించాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించగల బ్యాటర్, సమయోచిత పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా క్రికెట్ పండింతుల కితాబు అందుకున్న తెలుగు తేజం తిలక్ వర్మకు సైతం ప్రపంచకప్ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి!. ఆసియా కప్‌లో తిలక్ వర్మకు అవకాశం దక్కినా.. బంగ్లాదేశ్‌పై రాణించలేకపోయాడు. బలమైన ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో తిలక్ వర్మ మెప్పిస్తే.. ప్రపంచకప్ సమయంలో తెలుగు తేజాన్ని జట్టులోకి ఎంచుకునే అవకాశం లేకపోలేదు.
రాహుల్‌కు పగ్గాలు
ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్.. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు సారథ్య పగ్గాలు దక్కించుకున్నాడు. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యకు సైతం విశ్రాంతి లభించటంతో రాహుల్‌ను కెప్టెన్సీ అవకాశం వరించింది. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌కు మాత్రమే విశ్రాంతి లభించింది. అక్షర్ పటేల్ గాయంతో దూరమయ్యాడు. బుమ్రా, సిరాజ్, షమి, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణలు జట్టులో నిలిచారు. ఆసియా కప్‌కు ఎంపికైనా మెప్పించని.. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లు ఆసీస్‌తో సిరీస్‌లో ఫామ్ సాధించటంపై దృష్టి సారించనున్నారు. ఆసియా క్రీడల భారత జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలి రెండు వన్డేలకు జట్టులోకి వచ్చాడు. సెప్టెంబర్ 24న ఇండోర్‌లో రెండో వన్డే అనంతరం.. బెంగళూర్‌లోని ఆసియా క్రీడల జట్టుతో రుతురాజ్ కలువనున్నాడు. సెప్టెంబర్ 27న భారత జట్టు ఆసియా క్రీడల వేదిక హౌంగ్జౌకు బయల్దేరనుంది.
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు టీమ్ ఇండియా పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉండనుంది. వరల్డ్‌కప్ జట్టులోని 15 మందికి అదనంగా అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు జట్టులో కొనసాగనున్నారు.
భారత వన్డే జట్టు
తొలి రెండు వన్డేలకు
కెఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
మూడో వన్డేకు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.